అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్..

 అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్

 

జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని బుద్దా వెంకన్న అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

విజయవాడ, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై (Former CM YS Jagan) టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు. రైతుల‌ కోసం వెళ్లిన జగన్‌కు మందీ మార్బలం ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత, స్థాయి జగన్‌కు ఉందా అని మండిపడ్డారు.

రైతులపై కక్ష…

‘అసలు వ్యవసాయం గురించి నీకేం తెలుసు. నీ తాతది గ్రానైట్, నీ తండ్రి ఫ్యాక్షన్, వ్యాపారం, నీది దగా వ్యాపారం. అసలు జగన్‌కు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో. చదివి చెప్పడం కూడా జగన్‌కు చేత కావడం‌లేదు. ఫసల్ బీమా కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయి. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏమీ తెలియకుండా ఐదేళ్లు ఉన్నావా. నీకు ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా’ అంటూ ఫైర్ అయ్యారు.

ఆనందంతోనే వెళ్లారు..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు రైతుల వద్దకు వెళ్లి పరామర్శ చేశారని చెప్పిన బుద్దా వెంకన్న.. జగన్ రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు వేయించుకుంటారా అంటూ మండిపడ్డారు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరకు వెళ్లి కూడా ఇలాగే పూలు విసిరేయించుకుంటారంటూ విరుచుకుపడ్డారు. జగన్ పర్యటన ఆనందంతో వెళ్లినట్లుగా ఉంది కానీ.. పరామర్శకు వెళ్లినట్లు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వంద కార్లు, బైక్‌లు, జెండాలు, పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పరామర్శకు వెళ్లిక ఏకైక‌ నాయుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు.

ఆ మాత్రం తెలీదా…

జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్ రాత్రింబవళ్లు ప్రజల కోసం పని చేశారని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఆపగలమా… ‌నష్టం తగ్గిస్తామా అని ప్రశ్నించారు. ఆ మాత్రం జగన్‌ తెలియదా అని ఫైర్ అయ్యారు. వరదల సమయంలో కోటి ఇస్తా అన్నారని…. ఎవరికి ఇచ్చారంటూ జగన్‌ను నిలదీశారు. దేశంలో అత్యధిక సంపన్నుడినని స్వయంగా జగనే అఫిడవిట్‌లో చెప్పారన్నారు. జగన్‌కు పేదలు అన్నా, రైతులు అన్నా చులకన భావమని అన్నారు. రైతులకు మేలు చేయాలని‌ జగన్‌కు నిజంగా ఉంటే తుఫాను తగ్గిన సమయంలో ‌వెళ్లేవారన్నారు. చంద్రబాబు తుఫాను హెచ్చరికల నుంచే అందరినీ అప్రమత్తం చేశారని.. నేతలను, అధికారులను క్షేత్ర స్థాయిలో పరుగెత్తించారని తెలిపారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు ఇంట్లో‌కూర్చో పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు పడి లేచిన కెరటమని.. అలాంటి ఆయనకు జగన్ వార్నింగ్ ఇస్తారా అంటూ టీడీపీ నేత మండిపడ్డారు.

కేవలం ఫోటోల కోసమే..

11 సీట్లు వచ్చినా జగన్‌కు సిగ్గు శరం లేదంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. అందుకే రూ.42 వేల‌కోట్లు దోచుకుని జగన్ జైళ్లకు వెళ్లారన్నారు. ప్రజలు ఎవ్వరూ జగన్ కోసం రోడ్డు మీదకు రాలేదని గుర్తు చేశారు. కానీ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్ల‌పైకి వచ్చారని తెలిపారు. జగన్ తండ్రి ఎన్నో ఎంక్వయిరీలు వేసినా చంద్రబాబును దోషిగా చూపలేక పోయారని అన్నారు. చంద్రబాబు రైతు బిడ్డ.. అందుకే రైతల బాధలు ఆయనకు తెలుసన్నారు. జగన్.. ఫ్యాక్షనిస్టు బిడ్ట అని.. అందుకే విధ్వంసం చేశారని విరుచుకుపడ్డారు. సీఎంగా పొలంలో ‌కూడా దిగని జగన్.. నిన్న మాత్రం ఫొటోల కోసం పొలంలో అడుగు పెట్టారని అన్నారు. బురద లేని చోట మట్టి అంటకుండా పొలంలో పర్యటన బాగా చేశారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబును ఊర కుక్కలతో తిట్టిస్తే… ఆయన ఛరిష్మా తగ్గదని స్పష్టం చేశారు. జగన్ దండయాత్రలు మానుకుని ప్రజల కోసం పని చేయాలని హితవుపలికారు. తుఫాను సమయంలో ప్రభుత్వం చర్యలను చూసి ప్రజలంతా హర్షించారని తెలిపారు. జగన్‌కు ఇలాంటి మంచి‌ కనిపించదని… అబద్ధాలు, అసత్యాలతో మోసాలు చేయడమే వైసీపీ అధినేతకు తెలిసిన విద్య అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version