
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
మహబూబ్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..భారతదేశం గొప్ప ఆర్థిక మేధావిని కోల్పోయిందని, మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. మాజీ ప్రధాని పీ.వీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ఉన్నత స్థితికి చేర్చారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ఎంతోమంది అడ్డంకులు సృష్టించినా.. అందరిని ఒప్పించారని, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చాం కాబట్టి, మాట ప్రకారం తెలంగాణ ఇవ్వాల్సిందేనని ఆయన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. మన్మోహన్ సింగ్ కు తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అట్టడుగు వర్గాల వారి సంక్షేమానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు, విద్యాహక్కు చట్టం వంటి పలు చట్టాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వెంకటేష్,చంద్రకుమార్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు