పెరుగుతున్న చలి తీవ్రత.. స్వెటర్లు కొనుక్కున్నారా?
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం,మెదక్ సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి పడిపోవడంతో ఉదయం పూట కూడా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటోంది. రాగల రెండు రోజుల్లో రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో 2 నుండి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు, రేపు వాతావరణం పాక్షికంగా మేఘావ్రుతమై ఉండే అవకాశం ఉంటూ, ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉపరితలంపై వీచే గాలులు ఉత్తరం లేదా ఈశాన్యం దిశ నుండి గంటకు సుమారు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి లోని కొన్ని మండలాల్లో ఝరాసంగం జహీరాబాద్ న్యాల్కల్ మొగడంపల్లి కోహిర్ అత్యల్పంగా 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
జాగ్రత్తలు:
పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని వాతవారణ శాఖ తెలిపింది. వెచ్చని దుస్తులు ధరించాలి. ముఖ్యంగా రాత్రి, ఉదయం వేళల్లో ఉన్ని దుస్తులు, స్వెటర్లు, టోపీలు తప్పనిసరిగా ధరించాలని, ఉదయం పొగమంచు పూర్తిగా తగ్గిన తర్వాతే బయటకు వెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
