తెర వెనుక సూత్రధారులెవరు…?
– ఐనవోలు వెంచర్ వెనుక అదృశ్యశక్తులెవరు
– ఎవరి అండతో రియల్టర్లు, ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు
– అనుమతులు లేవంటున్న ‘కుడా’ చైర్మన్
– స్మశానంలో రియలెస్టేట్ ఏంటని ప్రశ్నిస్తున్న స్థానికులు
– ‘స్మశానంలో రియలెస్టేట్’ విషయంలో ఆరా తీస్తున్న ఇంటలీజెన్స్
నేటిధాత్రి బ్యూరో : ఐనవోలు మండలకేంద్రంలో స్మశానంలో వెంచర్ నిర్వహిస్తూ, కుడా అనుమతులు ఉన్నామంటూ ప్లాట్లు అమ్మకం పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. అధికారులు, కొంతమంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో కొందరు రియలెస్టేట్ వ్యాపారానికి తెరతీశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్మశానంలో వెంచర్ నిర్వహించడానికి ఓ కార్పొరేటర్ భర్త, అధికార పార్టీ ప్రజాప్రతినిధి హస్తం ఉందని వెనకల ఉండి వీరే ఆ తతంగం అంతా నడిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరు మాత్రం తమకేం సంబంధం లేదని అంటున్నారు.
‘నేటిధాత్రి’కి బెదిరింపులు
ఐనవోలు మండలకేంద్రంలో ‘స్మశానంలో రియలెస్టేట్’ పేరుతో కథనం వెలువడగానే అందులో ఎవరి పేర్లు లేకున్నా 58వ డివిజన్ కార్పొరేటర్ బానోతు కల్పన భర్త సింగ్‌లాల్ ‘నేటిధాత్రి’కి ఫోన్ చేసి భూకబ్జాల విషయం ప్రభుత్వం చూసుకోవాలని ఉపదేశమిచ్చారు. తన పేరుపై గజం భూమి లేదంటూనే వార్త రాసే ముందు తన వివరణ ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సంబంధం లేని అట్రాసిటి కేసు విషయం తీసుకువచ్చి కులం కార్డు వాడుతూ మీపై అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. తమ పేరు రాయనపుడు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నిస్తే తన పరువు పోయిందంటూ బాధపడిపోయారు. ఐనవోలు వెంచర్‌తో సంబంధం లేనపుడు ఎందుకు పరువుపోయిందని బాధపడాలో అర్థం కాని విషయం.
ఎవరి బలం చూసుకుని…
వర్థన్నపేట ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ ఎవరిని లెక్క చేయని తనంతోనే బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే అండ చూసుకుని ఏం చేసిన చెల్లుతుందనే ధీమాతో ప్రవర్తిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రియలెస్టేట్ వ్యాపారాన్ని వృత్తిగా చేసుకుని ముందుకు వెళుతున్న సింగ్‌లాల్ ఎమ్మెల్యే పేరుతో అధికార పార్టీలోని కొందరిని సైతం లెక్క చేయకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఇదంతా కేవలం ఎమ్మెల్యే అండతోనేనని పలువురు ఆరోపిస్తున్నారు.
అనుమతులు ఇవ్వలేదు…తప్పుడు ప్రకటనలు నమ్మెద్దూ
కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి
ఐనవోలు మండలకేంద్రంలో నిర్వహిస్తున్న లేఅవుట్‌కు సంబంధించి కుడా నుండి ఎలాంటి అధికారిక అనుమతి లభించలేదని కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తెలిపారు. నిర్వాహాకులు ఇస్తున్న ప్రకటనలు తప్పుగా మేము ధ్రువీకరిస్తున్నామని చెప్పారు.
లేఅవుట్ నిర్వహించడానికి ప్రజలు వ్యతిరేకం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్
మండలంలో నిర్వహిస్తున్న లేఅవుట్ నిర్వహణ కొరకు స్థానిక స్మశాన వాటికలు తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో వ్యతిరేకమైనప్పటికీ సంబంధిత అధికారులు చేస్తున్న ప్రయత్నాలు రియలేస్టేట్ దారులకు లాభదాయకంగా ఉండడం భాధాకరమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడిచర్ల శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.