తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన సార్వత్రిక ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ 4స్థానాలను కైవసం చేసుకోగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ 3స్థానాలను చేజిక్కించుకోగా, 16కు 16 గెలుస్తామనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 9స్థానాల వద్దే ఆగిపోయింది. ఇక ఎంఐఎం పార్టీ ఒకస్థానంతో సరిపెట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ 16కు 16 గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా రావడంతో టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఖంగుతిన్న పరిస్థితి నెలకొంది. ప్రజలు ఊహించని విధంగా తెలంగాణలో బిజెపి కరీంనగర్‌లో బండి సంజీవ్, సికింద్రాబాద్ కిషన్‌రెడ్డి, ఆదిలాబాద్ సోయం బాబురావులు గెలుపొందారు.
తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలలో బిజెపి 4స్థానాలను గెలవడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ పార్టీ 3స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక టిఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ మొదటి నుండి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఎలాగైనా కేంద్రంలో అధికారం చేపట్టి ప్రధాని కావాలనుకున్నారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా రావడంతో ప్రాంతీయ పార్టీలకు అవకాశం లేకుండాపోయింది. కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయస్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పాలనుకున్న కల కలగానే మిగిలిపోయింది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు వెలువడిన ఫలితాలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), భువనగిరి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (కాంగ్రెస్), మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్), నిజామాబాద్ ధర్మపురి అరవింద్ (బిజెపి), కరీంనగర్ బండి సంజీవ్ (బిజెపి), ఆదిలాబాద్ సోయం బాబురావు (బిజెపి), సికింద్రాబాద్‌లో జి.కిషన్‌రెడ్డి (బిజెపి), పెద్దపల్లిలో నేతకాని వెంకటేశ్వర్లు (టిఆర్‌ఎస్), నాగర్‌కర్నూల్‌లో రాములు (టిఆర్‌ఎస్), వరంగల్‌లో పసునూరి దయాకర్ (టిఆర్‌ఎస్), మహబూబాబాద్‌లో మాలోతు కవిత (టిఆర్‌ఎస్), ఖమ్మంలో నామా నాగేశ్వర్‌రావు (టిఆర్‌ఎస్), మెదక్ కొత్త ప్రభాకర్‌రెడ్డి (టిఆర్‌ఎస్), మహబూబ్‌నగర్‌లో యన్నం శ్రీనివాస్‌రెడ్డి (టిఆర్‌ఎస్), జహీరాబాద్‌లో బివి పాటిల్ (టిఆర్‌ఎస్), చేవేళ్లలో రంజిత్‌రెడ్డి (టిఆర్‌ఎస్), హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసి (ఎంఐఎం) కైవసం చేసుకున్నారు.