ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారం: సీఎం రేవంత్‌రెడ్డి
ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
ఉక్కు మహిళ సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మహిళలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రజాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ పదవైనా మహిళలకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కీలకమైన శాఖలను మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.వెయ్యి బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారని ప్రస్తావించారు.తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్‌లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఇటీవల మావోయిస్టుల లొంగుబాటులోనూ మహిళా అధికారులే కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని, నిర్వహణ బాధ్యతలూ అప్పగించామని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు, తగిన ఫలితం లేదన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. దేశంలో కుల, జెండర్ వివక్ష ఉందని తెలిపారు. అమెరికాలో కూడా వివక్ష ఉంది.. కానీ అక్కడ కష్టానికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇక్కడ మాత్రం కష్టపడేవారికి గుర్తింపు ఉండదని చెప్పుకొచ్చారు. కష్టపడేవారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అన్ని సంస్థలపైనా ఉంటుందన్నారు. అదే ఐడియాలజీతో యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని వెల్లడించారు.
