రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని బీజోన్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ జయంతి వేడుకలకు స్థానిక ఎస్సార్కే పాఠశాల కరస్పాండెంట్ పెద్దపల్లి ఉప్పలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజోన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి మాట్లాడుతూ… గడీలపై గళమెత్తి భూపోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళ లోకానికి స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పిన వీర వనిత అని అన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మహేందర్, రజక సంఘం కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, తిరుపతి, రాంబాబు, లత, స్వరూప, మహిళలు సంఘ సభ్యులు పాల్గొన్నారు