మహిళా సాధికారతకు.. తెలంగాణ పట్టం
దేవరకద్ర /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా.. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళ శక్తి పథకం కింద రూ. 15 లక్షల చెక్ లను మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని అన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 21 వేల కోట్లకు పైగా రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. వడ్డీలు, చక్రవడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలి కాకుండా మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. పెద్దపెద్ద కార్పొరేట్లకే పరిమితమైన పరిమితం అయిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దన్నగా ఉంటూ అండగా ఉంటూ ప్రజా పాలన అందిస్తున్నారని వెల్లడించారు. మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని, తమను ఈ సందర్భంగా మహిళలందరూ దీవించాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.