
గుండెపోటుతో ఉద్యమకారుడు మృతి
రుద్రంగిలో అలుముకున్న విషాద చాయలు
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన
తెలంగాణ ఉద్యమకారుడు వెంగల కొమురయ్య గౌడ్ శుక్రవారం ఉదయం
గుండె పోటు రావడంతో మృతి చెందారు. కొమురయ్య గౌడ్ మృతితో రుద్రంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించి, స్వరాష్ట్ర ఉద్యమాన్ని వినూత్న రీతులలో ఆచరించడం ద్వారా ప్రజాబాహుల్యాన్ని ఆకర్షించి,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తనలాంటి బడుగు, బలహీన వర్గాల ప్రజల బతుకులు బాగుపడతాయని ఆశపడి, అందుకోసం ఎన్నెన్నో ఆటంకాలు అధిగమించి రోజూ ఒక కొత్త తరహా కార్యక్రమంతో సమైఖ్యాంద్ర పాలకులకు తనదైన శైలిలో నిరసన తెలుపుతూ వినూత్నంగా
చెరువులో నీటి మధ్య నిరసన తెలపడం, చెట్టుపై కూర్చుండి నిరసన తెలపడం, శిరోముండనం చేసుకోవడం, రకరకాల వేషధారణలో
సుమారుగా 128 వేషధారణలతో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆయన సమైక్యాంధ్ర పాలకులు గో బ్యాక్ అంటూ నిత్యం గొంతెత్తి
నినదించేవారు…అలాగే ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు అరెస్ట్ కాబడి జైలుకు వెళ్లిన
కొమురయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమమే ఊపిరిగా పిడికిలెత్తి తెలంగాణ నినాదాన్ని ఈ ప్రాంతం తరపున ఉవ్వెత్తున ఎగిసిన
ఉద్యమకారుడు. తన నిరసన కార్యక్రమాలతో పెద్ద పెద్ద నాయకులను
వేములవాడకు, రుద్రంగికి రప్పించిన ఘనత కొమురయ్య గౌడ్ ది
అటువంటి గొప్ప ఉద్యమ కారుడి మృతి వార్త విని పార్టీలకు అతీతంగా ప్రజలు నాయకులు మృతదేహం వద్దకు చేరుకొని నివాళులర్పించి ఉద్యమ
స్మృతులను నెమరు వేసుకున్నారు.