సాయుధ పోరాట యోధుల చరిత్రను విస్మరించడం తగదు
ఎస్సారెస్పీ రెండవ దశకు బిఎన్ రెడ్డి పేరు పెట్టాలి
ఈనెల 19న ఇందిరా పార్క్ వద్ద ధర్నా
ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన రైతు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు
హైదారాబాద్,నేటిధాత్రి:*
తెలంగాణ ప్రజల విముక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటానికి నడుం బిగించి సర్వం త్యాగంచేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యోధుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం సరైందికాదని ధ్వజమెత్తారు.తక్షణమే ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు కామ్రేడ్ బి.ఎన్.రెడ్డి పేరు పెట్టాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జాతీయ ఉపాధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి హెచ్చరించారు. ఏఐకేఎఫ్, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును శ్రీరామ్ సాగర్ రెండవ దశకు నామకరణం చేయాలని, సూర్యాపేట జిల్లా బి.యన్.రెడ్డి జిల్లాగా మార్చాలని, ట్యాంక్ బండ్ పై బి.యన్.రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అందుకుగాను ఈనెల 19న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నా ప్రచార కరపత్రాలను హైదరాబాదులోని ఓంకార్ భవన్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు నైజాం రజాకార్ల చేతిలో బందిఐనా తెలంగాణ ప్రాంతాన్ని విముక్తిచేసి భూమి బుక్తికై సాయుధ పోరాటానికి నాంది పలికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు.పోరాటయోధుల చరిత్రను స్ఫూర్తి కలిగే విధంగా చరిత్ర పుటల్లో లిఖించి వారి ఆదర్శాలను త్యాగాలను పోరాట గాధలను గుర్తించుకునే విధంగా చేయాల్సిన పాలకులు చరిత్రను వక్రీకరించే చర్యలకు పూనుకోవడం దారుణం అన్నారు. అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆది నుంచి అంతం వరకు ముందుండి నడిపించిన గొప్ప యోధుడు అని ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రజలకు సాగు త్రాగు నీటి కోసం ఎస్సారెస్పీ జలాల సాధన కోసం ఎంతో పరితపించి అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి సాధించాడని అలాంటి వీరుల త్యాగాలు ఆదర్శాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైనప్పటికీ ప్రభుత్వాలు గుర్తించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు యోధులకు చరిత్రలో ప్రత్యేక గుర్తింపు కలిగించే విధంగా భవిష్యత్తు తరాలకు చరిత్రను అందించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అందులో భాగంగా కామ్రేడ్ బి ఎన్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ రెండవ దశకు నామకరణం చేయాలని సూర్యాపేట జిల్లాకు బి.ఎన్ రెడ్డి జిల్లాగా మార్చాలని ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు అందుకు వామపక్ష ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు, ప్రజల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అమరజీవి భీమిరెడ్డి నరసింహారెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి, అల్లుడు మల్లు కపోతం రెడ్డి, ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య రాష్ట్ర నాయకులు కుసుంబ బాబురావు, వస్కుల సైదమ్మ, పోతుకంటి కాశి తదితరులు పాల్గొన్నారు.
