ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ 85.21 శాతం
వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ 86.23 శాతంగా నమోదు
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ కేంద్రాలలో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 20 పోలింగ్ కేంద్రాలలో 86.23 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 10,526 మంది ఓటర్లలో 9,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు.
రెండు మున్సిపాలిటీలలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. గుర్తించిన ఆరు సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు.పోలింగ్ ముగిసిన అనంతరం నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు మరియు పోలింగ్ సామగ్రిని సంబంధిత వర్ధన్నపేట మునిసిపల్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌కు భద్రతా ఏర్పాట్ల నడుమ సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఎన్నికల సిబ్బంది, పోలీసు శాఖ, అధికారులు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములైన ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా అధిక శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు.
