అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ, నేటిధాత్రి:
ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరొక ముందడుగు పడింది.శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ కొత్తూరులో రూ.30 లక్షల వ్యయంతో, అలాగే 49వ డివిజన్ జూలైవాడా, రెవెన్యూ కాలనీల్లో రూ.1.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా పూర్తిగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన కాలనీలకు ప్రాధాన్యత ఇస్తూ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అంతర్గత రోడ్లు బాగుంటే ప్రజల దైనందిన జీవితం సులభమవుతుందని, వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తలెత్తకుండా సైడ్ డ్రైనేజీ పనులు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పనులు చేపడతామని, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు ప్రజల సహకారంతోనే సాఫీగా సాగుతాయని, అందరూ భాగస్వాములై పనుల పురోగతిని గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
