రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం
ఎల్డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి.
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి పదవికి షిగేరు ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయనున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో చీలకను నిరోధించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇషిబా ధ్రువీకరించినట్టు జపాన్ ప్రభుత్వరంగ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది.
జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఇషిబా సారథ్యంలోని ఎల్డీపీ ఎగువ సభ, దిగువ సభ రెండింటిలోనూ మెజారిటీని కోల్పోయిన క్రమంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఎగువ సభలో 248 సీట్ల మెజారిటీని సాధించడంలో ఎన్డీపీ విఫలమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో ఓటమికి బాధ్యత వహించాలంటూ పార్టీలోనే అసంతృప్తులు పెరిగాయి. ఎల్డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామా నిర్ణయానికి వచ్చారు.
ఇషిబా 1986లో తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. గత ఎల్డీపీ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. పలుమార్లు అధ్యక్షపదవికి కూడా పోటీ చేశారు.