సంగారెడ్డి జిల్లాలో పంటల కొనుగోళ్లపై విస్తృత సమీక్ష…

సంగారెడ్డి జిల్లాలో పంటల కొనుగోళ్లపై విస్తృత సమీక్ష – కలెక్టర్ ప్రావీణ్య సూచనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

2025–26 సీజన్‌లో పత్తి, ధాన్యం తదితర పంటల కొనుగోళ్లను పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత శాఖలతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశాల్లో పౌరసరఫరాల శాఖ , సహకారశాఖ, వ్యవసాయ, మార్కెటింగ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 2025–26 సీజన్ పత్తి సాగు, దిగుబడిపై సమగ్ర అంచనా ప్రకారం, పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మార్కెటింగ్ యార్డుల పరిధిలోని 24 జిన్నింగ్ మిల్లుల నుండి సీసీఐ ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. పత్తి అమ్మకానికి ఆధార్ ప్రామాణికత తప్పనిసరి అని, చెల్లింపులు రైతుల ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలలోనే జమ అవుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి యంత్రాలు, వసతులు, భద్రత ప్రమాణాలు సరిగా ఉన్నాయో లీగల్ మెట్రాలజీ శాఖ పర్యవేక్షణలో పరిశీలించాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి భద్రత సూచనలు ఇవ్వాలని సూచించారు.

రైతుల కోసం తాగునీరు, కనీస వసతులు కల్పించడమే కాకుండా, టోకెన్ సిస్టమ్ అమలు చేసి కొనుగోలు వ్యవస్థను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. అంతేకాక, రైతులు కిసాన్ కంపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసి నిర్ణీత సమయానికి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

2025–26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తీ స్థాయిలో ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ప్యాడి క్లీనర్లు, తార్పాలిన్లు, మాచర్ మిషన్లు, గన్ని సంచులు, లారీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గోనెసంచులను రైతులకు నేరుగా ఇవ్వకుండా, కొలత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పిపిసి సెంటర్ ఇన్‌చార్జీలు కొనుగోలు వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే స్వీకరించి ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటాచ్మెంట్‌లో ఉన్న నిర్దిష్ట రైస్ మిల్లర్లకే PPC సెంటర్ నిర్వాహుకులు ధాన్యం పంపాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సోయా చిక్కుడు – 7, మొక్కజొన్న – 9 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పంటల కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా పంటల కొనుగోళ్లు జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు .

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి – రెవెన్యూ శాఖ పై దృష్టి

రీజినల్ రింగ్ రోడ్ ( ఆర్ ఆర్ ఆర్ ), రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు ( ఆర్ఓబి ఎస్ ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణపై కూడా కలెక్టర్ సమీక్షించారు.

భూసేకరణలో ప్రజల హక్కులు కాపాడుకునేలా , రైతులకు న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. విక్రయ విలువలను ఆధారంగా పరిగణించి భూసేకరణను న్యాయంగా పూర్తి చేయాల్సిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ బాల సరోజ ,డి ఏం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్ ,సహకారశాఖ అధికారి కిరణ్ కుమార్ , జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ , జహీరాబాద్ ఆర్ డి ఓ దేవుజా నిమ్జ్ ప్రత్యేక అధికారిని విశాలాక్షి ,మార్కెటింగ్ శాఖ అధికారులు ,సంబంధితశాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version