కార్తీక్ వైద్య ఖర్చులకు లక్ష అందజేత
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పేద యువకుడు కార్తీక్ అనారోగ్యం పాలవగా, మెరుగైన వైద్యం కోసం సుమారు ఐదు లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కార్తీక్ కుటుంబం తమ నిరుపేద ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన చెందారు. ఈవిషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక తాజా మాజీ ఎంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ తక్షణమే స్పందించి, కార్తీక్కు సహాయం అందించడానికి దాతల సహకారం కోరారు. గుర్రం దేవిక రాజశేఖర్ చేసిన విజ్ఞప్తికి స్థానిక దాతలు, ప్రజలు ఉదారంగా స్పందించి తమ వంతు సహాయం అందించారు. దాతల నుంచి మొత్తంగా ఒక్క లక్ష రూపాయాలు విరాళంగా సమకూరింది. ఈవిరాళాన్ని రామడుగు మండల విద్యాశాఖాధికారి రంగనాథ శర్మ చేతుల మీదుగా కార్తీక్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈసందర్భంగా మాజీ ఏంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ మాట్లాడుతూ మానవత్వంతో స్పందించి కార్తీక్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసహాయం కార్తీక్ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమేష్, పి.డి,అనపురం తిరుపతి, తడగొండ రాజు, నాగం చంద్రమోహన్, చిలుముల శ్రీను, లక్ష్మణ్, నరసింహచారి, రాజమల్లయ్య, జనార్ధన్, సాయిలు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
