పి.డి.ఎస్.యు రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి.
వరంగల్‌లో పోస్టర్ ఆవిష్కరణ.
నేటిధాత్రి, వరంగల్
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జనవరి 5, 6, 7 తేదీలలో జరగనున్న మహాసభల సందర్భంగా శనివారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జనవరి 5వ తేదీ ఉదయం 11 గంటలకు హన్మకొండ ఏకశిలా పార్కు నుంచి ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం వరకు విద్యార్థి ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆడిటోరియం ఆవరణలో బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ బహిరంగ సభకు పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి, పి.డి.ఎస్.యు ఉమ్మడి ఏపీ పూర్వ అధ్యక్షులు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వరరావు, పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి.సంధ్య, పి.డి.ఎస్.యు జాతీయ నాయకులు పి.మహేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు తదితరులు ప్రసంగిస్తారని చెప్పారు. అనంతరం అరుణోదయ బృందం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జనవరి 6, 7 తేదీలలో వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్‌లో ప్రతినిధుల సభలు జరుగుతాయని తెలిపారు. 6వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జీవన్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొంటారని, ఆహ్వాన సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే తొలి పలుకులు వినిపిస్తారని పేర్కొన్నారు. ప్రారంభ ఉపన్యాసాన్ని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ వికాస్ బాజ్‌పాయ్ ఇస్తారని తెలిపారు. అలాగే వివిధ అంశాలపై ప్రొఫెసర్లు లక్ష్మీనారాయణ, బి.ప్రదీప్, చంద్రశేఖర్, కే.గోవర్ధన్, మైసా శ్రీనివాసులు ప్రసంగిస్తారని వెల్లడించారు.
7వ తేదీన జరిగే మహాసభలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిపి పలు తీర్మానాలను ఆమోదించి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారని తెలిపారు. ఈ మహాసభలకు ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావు, బన్న నర్సింగం, అలాగే పి.డి.ఎస్.యు వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్, కార్యదర్శి మర్రి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
