వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా పోచమ్మ బోనాలు
చందుర్తి, నేటిధాత్రి :
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు అమ్మవారి, పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ బోనాల సాంస్కృతిక పాటలతో నృత్యాలతో పిల్లలు గ్రామ ప్రధాన కూడలిల వద్ద నృత్యాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సద్గుణ చారి మాట్లాడుతూ ….. ఆషాడ మాసంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పండగను దేవతకు ఒక ప్రతిరూపంగా భావిస్తారు. బోనం వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు. మహిళలు కొత్త మట్టి, ఇత్తడి కుండలో పాలు బెల్లం బియ్యం కలిపి వండుతారు. దీనిని వేప ఆకులు, పసుపు మరియు సింధూరంతో అలంకరిస్తారు. మహిళలు ఈ బోనాలను తలపై మోసుకొని దేవాలయంలో అమ్మ దేవతకు గాజులు మరియు చీరతో సహా బోనం నైవేద్యం పెడతారు. బోనాలు అంటే కాలిని మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ మొదలైన వివిధ రూపాల్లో పూజించడం అని వివరించారు. పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలో బోనాలు నెత్తిన పెట్టి పోతరాజుల విన్యాసాలతో గ్రామంలోని ప్రధాన కూడలి వెంట పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. చిన్నప్పటినుండి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడానికి పాఠశాలలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల కరస్పాండెంట్ సద్గుణ చారి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.