సమస్యల వలయంలో నర్సంపేట పట్టణం
పారిశుద్ధ్య పనులను తక్షణమే చేపట్టాలి
మున్సిపాలిటిలో ఎం సిపిఐ(యు) వినతిపత్రం
నర్సంపేట,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సమస్యల వలయంలో చిక్కుకున్నది.పట్టణ పరిష్కారం కోసం ఎం సిపిఐ(యు) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని,కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తీయకపోవడం మూలంగా వర్షపునీరు పొంగి ఇళ్లలోకి చేరుతుందని ఆరోపించారు.ప్రధానంగా కార్ల్ మార్క్స్ కాలనీ,జ్యోతిబసు నగర్ లలో డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షం పడిందంటే వరద నీరు ఇళ్లలోకిచేరి చెత్తాచెదారంతో దుర్వాసనతో అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు.మార్క్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో మరదమయంగా మారుతుందని తెలిపారు.పట్టణంలో కుక్కల కోతుల,బెడదల మూలంగా పట్టణవాసులు బయటికి రావాలంటేనే జంకుతున్నారని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ చెన్నారావుపేట మండల కన్వీనర్ జన్ను రమేష్ ,టౌన్ కమిటీ సభ్యులు కల్లెపెల్లి రాకేష్ ,విద్యార్థి నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.
