రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ
రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం-వెలిచాల తిర్మల్ రావు
గంగాధర, నేటిధాత్రి:
తమ రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు పేర్కోన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలిచాల తిరుమలరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను బిఆర్ఎస్ నాయకులు భూతద్దంలో పెట్టి చూపిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని దుయ్యబెట్టారు. నాటి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోసపడ్డ పట్టించుకున్న నాధుడే లేడని, క్వింటాలకు ఆరు కిలోల వరకు కట్ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని మర్చిపోలేదని గుర్తు చేశారు. కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని, ఇరవై ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నారాయణపూర్ నిర్వాసితుల ఎదురుచూపుకు తెరదించుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇరవై మూడున్నర కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ పై పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరు చేశారని గుర్తు చేశారు. అబద్దాలతో కాలం గడుపుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మాజీ ఎంపిపి రాజగోపాల్ రెడ్డి, పడితపల్లి కిషన్, మాజీ వైస్ ఎంపిపి కర్ర బాపురెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు, బూరుగు గంగన్న, రేండ్ల రాజిరెడ్డి, రోమాల రమేష్, వంగల శ్రీనివాస్, ముద్దం నగేష్, కనకట్ల తిరుపతి, దోమకొండ మహేష్, జితేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
