*తిరుపతి ఎంపీ గురుమూర్తి కృషితో గుడిమల్లం అన్నదాన సత్రానికి అనుమతులు మంజూరు..
తిరుపతి నేటి ధాత్రి:
తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి నిరంతర కృషి ఫలితంగా గుడిమల్లం శ్రీ పరసురామేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనుమతి మంజూరు చేసింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన శివలింగాలలో ఒకటైన గుడిమల్లం శివ లింగాన్ని దర్శించేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు విచ్చేసే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో అవసరమైన సౌకర్యాల విస్తరణ అత్యవసరమని ఎంపీ గురుమూర్తి పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి, పురావస్తు శాఖకు లేఖల ద్వారా వివరించారు.
భక్తుల సేవలకు ప్రధానమైన కల్యాణకట్ట, పాకశాల, అన్నదాన శాల, యాగశాల, రాధాశాల వంటి నిర్మాణాలకు 2022 నుంచి అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్‌కు వరుసగా లేఖలు రాసి అనుమతులు కోరారు.ఈ నిర్మాణాల్లో కొంత భాగం ఆలయ రక్షిత ప్రాంతంలోకి రావడంతో అనుమతులు ఆలస్యమవుతున్న విషయం కూడా ఎంపీ గురుమూర్తి పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పరిస్థితుల్లో, భక్తులకు అత్యవసరమైన తాత్కాలిక అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ నో అబ్జెక్షన్’ జారీ చేసింది.సర్వే నెం.17లో 5 మీటర్ల ఎత్తు, 1913.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ తాత్కాలిక నిర్మాణానికి కొన్ని నిబంధనలతో అనుమతి మంజూరు చేశారు.
అనుమతిలో భాగంగా:
నిర్మాణ పనులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, అమరావతి సర్కిల్ పర్యవేక్షణలో జరగాలి.
సంబంధిత శాఖల నుండి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలి.
స్థానిక బై–లాస్ కు అనుగుణంగా నిర్మాణం జరగాలి.
గుడిమల్లం ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ ఇప్పటికే రూ.95 లక్షల
సి జి ఎఫ్, నిధులు కేటాయించిన విషయాన్ని ఎంపీ గురుమూర్తి కేంద్రానికి తెలియజేశారుఈ అనుమతి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని, గుడిమల్లం ఆలయ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
