అగ్రవర్ణాల కుట్రతోనే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన
ధర్నా రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్, పోలీసుల చొరవతో నిరసన విరమణ
నర్సంపేట నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే హైకోర్టు స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ఆరోపించారు. రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వేసిన దాఖలు పట్ల గురువారం హైకోర్టు మద్యంతర స్టే విధించింది. దీంతో త్వరలో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పాటు బీసీ కులాల విద్య ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జీజుల శ్రీనివాస్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు అమరవీరుల స్థూపం వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ధర్నా రాస్తారోకో పట్ల సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అరుణ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడి నిరసన విరమింప చేశారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల హక్కులు రిజర్వేషన్ల కోసం కొన్ని ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అగ్రవర్ణ కులాల కుట్రలో భాగంగా హైకోర్టులో ఫిర్యాదు మేరకు హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. దీంతో బీసీలకు ఉద్యోగ,ఉపాధితో పాటు అన్ని విధాల అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి కోర్టులకు వెళ్లలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను వెంటనే ఎత్తివేసి 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు స్టే విధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కొట్లాడుతున్న మపై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, భేతి భాస్కర్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగం శివాజీ, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బండారి ఉదయ్ కిరణ్, మండల నాయకులు బండారి ప్రకాష్ ముదిరాజ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, మహిళా అధ్యక్షురాలు బండి విజయ, కార్యదర్శి చామంతుల రమేష్, చెన్నారావుపేట టౌన్ మహిళా అధ్యక్షురాలు ముంజ లక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కారుపోతుల శ్రీదేవి, మహిళా నాయకురాలు వైనాల రజిత, గొర్రె వినయ్, శ్రీకాంత్, ల్యాగల ప్రవీణ్ కుమార్, సింగనబోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.
