ఆదానీ, అంబానీలకు లాభం చేయడం కోసమే బొగ్గు బ్లాకుల వేలం
మణుగూరు పికె ఓసి2 ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
కోల్ ఇండియా వ్యాప్తంగా 41బొగ్గు బ్లాకులను కేంద్రం ప్రభుత్వం వేలం వేయడాన్ని ఒప్పుకునేదే లేదని, మణుగూరు పికె ఒసి2 డిప్ సైట్ ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాటం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న మణుగూరు పికె ఓసి2 ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలైన ఆదా అని, ఏఎంఆర్ జెన్కో, మేఘ కృష్ణారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్కో కంపెనీలకు వేలం వేయడానికి ఏడు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. పీకే ఓ సీ2ను సింగరేణి దక్కించుకోకుంటే మణుగూరులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. అందులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో వేలంలో పాల్గొనడాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండిస్తుందని, వెంటనే జెన్కో సంస్థ వేలం నుండి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మణుగూరు పీకే ఓసి 2 ఓసి బ్లాక్ లలో సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, 167 హెక్టార్లలో బొగ్గు ఉందని, కంపెనీకి ఆదాయాన్ని తెచ్చి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు వేలం వేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీలకు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని, వారికి లాభం చేకూర్చడం కోసమే ఈ బొగ్గు బ్లాగులను వేలం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు పీకే ఓసి2 ని వేలం వేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోలేని సింగరేణి రక్షణ కోసం విశాఖ స్టీల్ ఉద్యమంలాగా రాబోయే రోజుల్లో కార్మిక సంఘాల ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, కాంట్రాక్ట్ కార్మికుల ఇంచార్జ్ నూకల చంద్రమౌళి, స్థానిక నాయకులు నల్ల సత్తి కుమారస్వామి బాబురావు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
