గద్దర్ ఆశయ సాధనకై యువత నడుం బిగించాలి.
#బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి.
నల్లబెల్లి, నేటి ధాత్రి :
తన ఆట ద్వారా పాట ద్వారా ప్రజలను చైతన్యపరిచి ప్రశ్నించడమే నేర్పిన గద్దర్ అన్న ఆశయాలు సాధించడం అంటే బహుజనులు రాజ్యాధికారం సాధించడమే అనీ చింతకింది కుమారస్వామి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజా కవి గద్దర్ 77వ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ తన జీవితంలో ప్రతి నిమిషం ఎస్సీ ఎస్టీ బీసీలైన కూలీలు పేద రైతులు కార్మిక రంగాలకు చెందిన వారికోసమే తన కలాన్ని, గళాన్ని ఉపయోగించిన ప్రజాకవి గాయకుడు గద్దర్ అన్నారు. తన ఆట ద్వారా పాట ద్వారా అగ్రకుల అధిపత్య పాలకుల నియంతృత్వం దోపిడినీ ఎదిరించడమే కాకుండా, వెనుకబడిన కులాలకు అణగారిన వర్గాలలో ప్రశ్నించే తత్వాన్ని చైతన్యాన్ని నింపడం కోసమే కృషి చేశారన్నారు. ఎప్పటికైనా బహుజనులైన కూలీలు కార్మికులు పేదలు రాజ్యాధికారం మీదికి రావాలన్న ఆయన కలలను సాకారం చేయాలంటే అగ్రకుల పెట్టుబడిదారుల రాజకీయ పార్టీల జెండాలు మోయడం మాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైన కూలీలు రైతులు కార్మికులు పేదలు తమ ఓట్లు తామఘ వేసుకొని రాజ్యాధికారం మీదికీ రావడం ఒక్కటే గద్దర్ కు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, అణగారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పరికి కోర్నేలు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం నాగెల్లి శ్రీధర్, సురేష్ బూస కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు
