
ఎక్సైజ్ శాఖలో విషాదం
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే- 3(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ ఎస్సై ఖాళీ ప్రసాద్ అనుమానాస్పదంగా గురువారం రాత్రి మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్ మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. అతని భార్య సావిత్రి 18 రోజుల క్రితం చనిపోగా అప్పటినుండి తీవ్ర మనస్థాపనతో మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు. ఇదే క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆయన అద్దెకు ఉంటున్న రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని తలుపులు తీసి పిలిచిన పలకక పోవడంతో అనుమానంతో ఇంటిలోకి వెళ్లిన ఇంటి యజమాని అప్పటికే మృతి చెందిన ఎక్సైజ్ ఎస్సై కాళీ ప్రసాద్ ను చూసి ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ సీఐ సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన కాళీ ప్రసాద్ ను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై రమాకాంత్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కాళీ ప్రసాద్ కు కుమారుడు సాయి రేవంత్, కూతురు ఉన్నారు. ఎక్సైజ్ ఎస్సై కాళీ ప్రసాద్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఎక్సైజ్ శాఖలో, మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.