కోమల పోరాటాన్ని అడ్డుకుంటున్న పోలీసులు
సుశృత-దేవర్ష్‌ల సమాధిని స్మారక స్మృతివనంగా ప్రకటించాలని, సుశృత తల్లి కందిక కోమల చేస్తున్న పోరాటాన్ని అడ్డుకుంటున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని సుశృత-దేవర్ష్ న్యాయపోరాట సంఘీభావ కమిటీ జనగామ జిల్లా కలెక్టర్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుశృత-దేవర్ష్ భార్యబిడ్డలున దారుణంగా చంపిన హంతకుడు మాచర్ల రమేష్ ఇంటి ఎదుట సుశృత తల్లి కందిక కోమల సమాధి కట్టిందని, ఫిబ్రవరి 10వ తేదీ నుండి సమాధిని సుశృత-దేవర్ష్ స్మారక స్మృతివనంగా ప్రకటించాలని, రిలే నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. దీక్షలు నేటికి 64రోజుకు చేరుకుందని తెలిపారు. కోమల చేస్తున్న పోరాటానికి మద్దతుగా దళిత, ప్రజాసంఘాలు సుశృత-దేవర్ష్ న్యాయపోరాట సంఘీభావ కమిటీగా ఏర్పడిందని, డిమాండ్ల సాధన కోసం జనగామ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కలిసిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత స్మారక స్మృతివనం డిమాండ్‌ను పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. హామీ నెరవేరకుండానే పాలకుర్తి సీఐ, ఎస్సైలు దీక్షలో కూర్చున్న కోమలపై బెదిరింపులకు పాల్పడుతూ పోరాటాన్ని విరమించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పారు. కోమల పోరాటానికి అడ్డుపడుతున్న సీఐ, ఎస్సైలపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా జనగామ జిల్లా కలెక్టర్‌ను కోరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశృత-దేవర్ష్ న్యాయ పోరాట సంఘీభావ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య, రాష్ట్ర కన్వీనర్ గడ్డం సదానందం, జనగామ జిల్లా నాయకుడు గట్టు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.