మహబూబ్ నగర్/ నేటి ధాత్రి
నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో పాటయే ఆయుధం అయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన సుద్దాల హనుమంతు సాంస్కృతిక ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సుద్దాల హనుమంతు కవిగా కళాకారుడిగా, వాగ్గేయకారుడిగా అంతకుమించి జీవితమంతా కష్టజీవుల కోసం అంకితం అంకితం చేశారన్నారు. తెలంగాణ జాతి యావత్తును తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు అని ఆనాడు సాయుధ పోరాటంలో ఆయన రాసిన పల్లెటూరి పిల్లగాడ పసుల గాసే మొనగాడ.. పాట ఎందరినో ప్రభావితం చేసిందన్నారు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుందన్నారు. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుందని. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల హనుమంతు సాహిత్యం అని ఆయన చెప్పారు. వారి వారసత్వాన్ని సజీవంగా ఉంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు . ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా సుద్దాల హనుమంతు జీవితం సాహిత్యం అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నమీబియా దేశపు పూర్వపు మాజీ మంత్రి బెర్నార్డ్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, బెక్కెం జనార్థన్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డాక్టర్ జె.రాంమోహన్, జగపతి రావు, భూపతిరావు తదితరులు పాల్గొన్నారు.