ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేయాలి
ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేయాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీసు ఆవరణలో జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చి విదేశీ పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు అనుకూలంగా విధానాలను రూపొంది దేశీయ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని ఈ క్రమంలో కార్మికుల రైతుల ప్రజల హక్కులను హరించే విధంగా గతంలో ఉన్న చట్టాలను కాలరాస్తూ నియంతృత్వ విధానాలను రూపొందిస్తూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి కొత్త చట్టాన్ని తెచ్చింది అన్నారు. ఉగ్రవాదం మతోన్మాదం పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో తుంగలో తొక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై, ఎన్నికల హామీల అమలుకై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ శాఖలను నిరంతరం కదలికలో ఉంచాలని కోరారు. రాజకీయ విలువలను కాపాడేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, మంద రవి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, కుసుంబా బాబురావు,వంగల రాగసుధ, నాగేల్లి కొమురయ్య, మాలోత్ సాగర్, సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు సింగతి మల్లికార్జున్, కేశెట్టి సదానందం,దామ సాంబయ్య, మాలోత్ ప్రత్యూష, ఎగ్గని మల్లికార్జున్, అప్పనపురి నరసయ్య, మాలి ప్రభాకర్,గణిపాక ఓదేలు తదితరులు పాల్గొన్నారు.
