
-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
*అత్యవసర సమయాల్లో మిషన్ భగీరథ కు ప్రత్యామ్నయ నీటి వనరులను గుర్తించాలి
*అత్యవసర పనులను వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలి
*వేసవికాలంలో త్రాగునీటి సరఫరాపై మండల, మున్సిపల్, సంభందిత శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
వేములవాడ, నేటిధాత్రి;
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేసవి కాలంలో సమృద్ధిగా త్రాగునీరు అందించే విధంగా పటిష్ట కార్యాచరణ రూపొందించి దాని అమలుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.గురువారం సమీకృత జిల్లా కలెక్టరెట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి వేసవికాలంలో త్రాగునీటి సరఫరా, స్థితిగతులపై మండల స్థాయి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, ఎండాకాలం దృష్ట్యా త్రాగునీటి సరఫరా పకడ్బందీగా ఉండేలా చూడాలని, చిన్న ఇబ్బంది ఎదురైనా సమస్య తీవ్రత ఎక్కువ చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, పక్కా ప్రణాళికతో మనం చర్యలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సరఫరా చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, స్థానికంగా ఉన్న నీటి వనరులు, బోరు బావులను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న త్రాగు నీటి పంపులు, బోరు బావుల మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద త్రాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా కోసం అవసరమైన అత్యవసర పనులను వెంటనే నామినేషన్ పద్ధతిలో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ ఇంట్రా పెండింగ్ పనులు సకాలంలో పూర్తి కావాలని అన్నారు.
సిరిసిల్ల,తంగళ్ళపల్లి ,ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ,గంభీరావుపేట, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ ,చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట , బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాల వారీగా త్రాగునీటి సరఫరా ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా కార్యాచరణను పూర్తిచేసే సన్నద్ధంగా ఉండాలని అన్నారు.
గ్రామాలలో ఉన్న ప్రతి వార్డు, మున్సిపల్ వార్డులు, చివరి హ్యాబిటేషన్ వరకు త్రాగునీటి పరిస్థితిపై మండల ప్రత్యేక అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని
కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి గ్రామం, ప్రతి బస్తి, ప్రతి మున్సిపల్ వార్డులో త్రాగునీటి సరఫరా ప్రణాళికలు రూపొందించుకోవాలని, నీటి లీకేజీలను ఎప్పటికప్పుడు నియంత్రించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. త్రాగునీటి సరఫరా హెడ్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్రా స్థాయిలో నీటి లెవల్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఏదైనా సమస్య అయితే సకాలంలో స్పందించి వాటిని త్వరగా పరిష్కరించేలా చూడాలని అన్నారు.
జిల్లాలో త్రాగునీటి సరఫరా కోసం స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని, స్థానిక సంస్థల పరిధిలో చేయు పనుల కోసం ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డు రాదని కలెక్టర్ తెలిపారు. అందుబాటులో ఉన్న నిధులతో చేపట్టే పనులు త్వరగా గ్రౌండ్ అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.
వేసవిలో ప్రణాళికాబద్ధంగా నీటి సరఫరా చేపట్టాలని, నీటి వృధాను అరికట్టాలని, నీటి లీకేజీలను సత్వరమే పరిష్కరిస్తూ చర్యలు తీసుకోవాలని, అవకాశం ఉన్నచోట హ్యాండ్ పంపులు, నీటి సరఫరా మోటార్లను పునరుద్ధరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో ఉమా రాణి., జిల్లా పంచాయతీ అధికారి, వీర బుచ్చయ్య, మిషన్ భగీరథ ఈ ఈ లు, జానకి, విజయ్, ఆర్.డబ్ల్యూ ఎస్., పబ్లిక్ హెల్త్ ఈ.ఈలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డి.ఈ.ఈలు, డివిజనల్ పంచాయత్ అధికారులు, ఎం.పి. ఓలు, ఏ.ఈ.ఈ లు, తదితరులు పాల్గొన్నారు.