నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.

మిషన్ భగీరథ వాటర్ మెన్ లకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక.

జడ్చర్ల / నేటి ధాత్రి

 

 

మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే వాటర్ మెన్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కూడా హెచ్చరికలు చేసినా తమ వైఖరిని మార్చుకోని వాటర్ మెన్ లను విధుల నుండి తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేసవి కాలంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవల్సిన బాధ్యత మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది పైనే ఉందని చెప్పారు. ఈ విషయంగా శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో మిషన్ భగీరథ వాటర్ మెన్ ల పనితీరుపై తమకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు. కొంతమంది వాటర్ మెన్ లు సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం, నిర్ణీత వేళలలో తగినంత సమయం నీటి సరఫరా చేయకపోవడం వల్ల పలు గ్రామాలలో ప్రజలు త్రాగునీటి కి ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పరిశ్రమలు ఉన్న ప్రాంతాలలో ప్రజలకు తక్కువ నీటిని సరఫరా చేసి తమకు కావాల్సిన పరిశ్రమలకు ఎక్కువ నీటిని పంపిణీ చేస్తున్నట్లు కూడా ఫిర్యాదులు అందాయన్నారు.ప్రత్యేకించి బాలానగర్, జడ్చర్ల మండలాల్లో వాటర్ మెన్ లపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాటర్ మెన్ లను ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో తాము ఆ పని చేయలేదన్నారు. అయితే ప్రస్తుతం వేసవిలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటర్ మెన్ ల కారణంగా ప్రజలు నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం తాను సహించేది లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ఇకనైనా వాటర్ మెన్ లు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ నిర్ణీత వేళలలో నీటిని సరఫరా చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కాగా మిషన్ భగీరథ వాటర్ మెన్ ల కారణంగా ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడి నీళ్ల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటే ప్రజలు జడ్చర్ల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అనిరుధ్ రెడ్డి ప్రజలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు కూడా నీటి సరఫరాను, వాటర్ మెన్ ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version