ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవలు చేస్తే కఠిన చర్యలు
భూపాలపల్లి నేటిధాత్రి
తాలు, తడక పేరుతో రైతులను దోపిడీకి గురిచేస్తే ఎంతమాత్రం సహించేదిలేదని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మిల్లర్లును హెచ్చరించారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ధాన్యం, మక్కలు కొనుగోలుపై రెవిన్యూ, పౌరసరఫరాలు, పౌరసరఫరాల సంస్థ, వ్యవసాయ, మార్కెటింగ్ రవాణ, డిఆర్డిఓ, సహకార, పంచాయతీరాజ్, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుకు ట్రక్ షీట్ ఇవ్వకపోవడం పట్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 30 రోజులు దాన్యం, మక్కల కొనుగోలులో చాలా ప్రతిష్టాత్మమని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని తెలిపారు. సమావేశాల్లో మాట్లాడుకున్నది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేసిన తదుపరి రైతుకి ఏమి సంబంధమని, ట్రక్ షీట్ జారీ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని, దాని వల్ల రైతుల ఇబ్బందులకు గురి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఫల్యం జరుగుతుందని అందుకు ఆయా శాఖల అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తాలు పేరుతో అబద్ధాలు ఆడొద్దని సూచించారు.
మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో వరి కోత యంత్రాల యజమానులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. తాలు, తరుగులు తీయొద్దని మిల్లర్లుకు పలుమార్లు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. మీ సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం కానీ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన తదుపరి కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, మిల్లర్లదే బాధ్యతని కాంటా అయ్యేంత వరకు మాత్రమే రైతు బాధ్యతని తెలిపారు. అకాల వర్షాలకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని
తెలిపారు. రైతులను ఎందుకు ఇబ్బందులు గురి చేస్తున్నారని అని ప్రశ్నించారు. ఇది రైతు చేసిన పాపమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాము, రవాణా, కాంటా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రవాణాలో ఇబ్బందులు కల్పిస్తే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రవాణాలో ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇదే చివరి వార్నింగ్ అని హెచ్చరించారు. రైతులకు 48 గంటల్లో నగదు జమ చేసేందుకు కొనుగోలు జరిగిన వెంటనే ఓపిఎంఎస్ లో నమోదు చేయాలని తెలిపారు. రైస్ మిల్లులు వద్ద దాన్యం దిగుమతి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి తనకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్ఓ వసంతకుమారి, పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, డిఎం రాములు, వ్యవసాయ అధికారి బాబూరావు, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, రమణా శాఖ అధికారి మహమ్మద్ సంధాని, డిఆర్డిఓ బాలకృష్ణ, సహకార అధికారి వాలియా నాయక్, డిపిఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
