ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంతో సహా వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా కొనసాగుతుంది. సమస్య ఏదైనా అందులో తలదూర్చి సెటిల్‌మెంట్‌ చేస్తామని చెప్పడం ఈ గ్యాంగ్‌ల ప్రత్యేకత. సమస్య ఏదిలేకున్న వీరే తమ సొంత తెలివితేటలతో సమస్యలను సృష్టించి ఆ సెటిల్‌మెంట్‌ వీరివల్లే అయ్యేవిధంగా చేసి పరిష్కారం చేస్తామని చెప్పి డబ్బులు దండుకోవడం వీరు అలవాటు చేసుకున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీరి బాధితులు అధికసంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది సమస్య పరిష్కారం కోసం పోయి ఉన్న ఆస్తిని పొగుట్టుకున్న ఉదందాలు సైతం ఉన్నాయని తెలిసింది.

గొడవ ఏదైనా సరే

గొడవ ఏదైనా సరే అందులో కలగజేసుకోవడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అలవాటు చేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్‌ సమస్యలు, భూవివాదాలు, కుటుంబ గొడవలు తదితర విషయాల్లో ఈ సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు. కలగజేసుకుని పరిష్కారం పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని బాదితులను ఇబ్బందులకు గురిచేస్తుంటారట. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ప్రధానంగా భూవివాదాల్లో కలగజేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాయట. భూమిలో సగం తమకు అప్పగిస్తే లేదంటే మార్కెట్‌ రేటు ప్రకారం తమకు కమీషన్‌ చెల్లిస్తే సమస్య పరిష్కారం చేస్తామని నమ్మబలికి అందినకాడికి అందుకుపోవడం ఈ గ్యాంగ్‌లు చేస్తుంటాయట. కొన్ని సందర్భాల్లో భూవివాదాల్లో ఇరువర్గాలు వీక్‌ అని తెలిస్తే భూమిని తమ పేర చేసుకుని సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు అసలు హక్కుదారులకు చుక్కలు చూపిస్తారట.

పరిచయాల పేరుతో బురిడీ

సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల మరో ప్రత్యేకత ఏంటంటే పరిచయాలతో బురిడీ కొట్టించడం తమకు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర గ్యాంగ్‌లు చాలా దగ్గర అని చెపుతూ సమస్యను తామే పరిష్కరిస్తామని చెప్పడం వీరికి వెన్నతో పెట్టిన విద్యేనట. నిజానికి ఇలాంటి గ్యాంగ్‌లకు కొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు అండగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎవరైన సమస్యలతో వీరి వద్దకు వస్తే ఫలానా గ్యాంగ్‌ దీన్ని సెటిల్‌ చేస్తుందని అక్కడకు వెళ్లండని సూచిస్తున్నట్లు తెలిసింది. సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు ఏది సెటిల్‌ చేసిన అది నిజమేనని కొంతమంది పోలీస్‌ అధికారులు నిర్థారిస్తూ ఆ సెటిల్‌మెంట్‌కు అదికార ముద్ర వేస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కొన్ని పోలీస్‌స్టేషన్‌లలో సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తెల్లవారిందంటే చాలు సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు పోలీస్‌స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోనే తచ్చాడుతూ ఉంటారట.

సంవత్సరాలపాటు సాగదీత

ఇరువర్గాలను తమ చేతిలో ఉంచుకుని సమస్యను పరిష్కారం ఏయకుండా సంవత్సరాలపాటు సాగదీయడం సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు బాగా అలవర్చుకున్నాయట. గ్యాంగ్‌ల సాగదీతకు జడుసుకున్న కొంతమంది ఇరువర్గాలు ఏకమై తమ సమస్యను తామే పరిష్కారం చేసుకున్న సందర్బాలు ఉన్నాయట. గ్యాంగ్‌ల సాగదీత పరిష్కారాల మూలంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలు అనేకం ఉన్నాయట. సమస్యను పరిష్కారం చేయాలంటే ఉదయం అల్పాహారంతో మొదలుకుని మందు, విందు వరకు అన్ని బాధితులే చూసుకోవాలట. ఈ ఖర్చు పెట్టలేక కొంతమంది బాదితులు అప్పులపాలైన సందర్బాలు ఉన్నాయి.

సెటిల్‌మెంట్లే ఉపాధి

ఇస్త్రీ పోల్డ్‌ నలగని చొక్క, చుట్టు మంది మార్బలం ఏర్పాటు చేసుకుని కాసింత బిల్డప్‌ కలగలుపుకుని సెటిల్‌మెంట్‌ గాండ్లు దర్శనమిస్తారట. సెటిల్‌మెంట్లనే ఉపాధిగా చేసుకుని బతుకుతున్న వీరు కేవలం వీటిపైన ఆధారపడి బాధితులను బురిడీ కొట్టించి లక్షల రూపాయలు వెనకేసిన వారు ఉన్నారట. భూసమస్యల్లో తలదూర్చిన సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లైతే సమస్యను పరిష్కారం చేయకుండా ఎంతో కొంత నగదు ముట్టజెప్పి బాధితుల వద్ద నుంచి కారుచౌకగా భూములు దండుకున్నవారు ఉన్నారట. మొత్తానికి సెటిల్‌మెంట్‌ ఉపాధి చేసుకుని బాధితుల బలహీనతలు ఆసరా చేసుకుని జీవితాలను ఆగం చేసిన వారు ఉన్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!