
# సాయుధ పోరాట చరిత్ర వక్రీకరిస్తున్న పాలకులు
# సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే..
# సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు.
# నర్సంపేటలో సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ర్యాలీ సభ.
నర్సంపేట,నేటిధాత్రి :
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం అర్ధ రహితం అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళపల్లి శ్రీనివాసరావు అన్నారు.ఈ నెల 11 నుండి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నర్సంపేటలో అంబేద్కర్ సెంటర్ నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు సిపిఐ మండల సమితి ఆద్వర్యంలో ర్యాలీ,సభ నిర్వహించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సిపిఐ మండల కార్యదర్శి గడ్డం యాకయ్య అద్యక్షతన జరిగిన సాయుధ పోరాట వారోత్సవాల సభలో తక్కళపల్లి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విలీన దినోత్సవంపై కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఈ నెల 17న విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను మభ్యపెట్టేమదుకేనని, నైజాం వ్యతిరేక పోరాటంలో బిజెపి పాత్ర ఏమాత్రం లేదన్నారు. పైగా తెలంగాణ పోరాటాన్ని హిందూ,ముస్లీం మద్య జరిగిన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్ బండ్ పై సాయుధ పోరాట యోధుల విగ్రహాలు పెడతామని, పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట పోరాట చరిత్రను చేర్చుతామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఆ హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాలలో జాతీయ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని, కాని ఆ రోజు ప్రజా పాలన దినోత్సవంగా జరుపుతామనడ సరికాదని అన్నారు. నైజాం సర్కారు అండగా ఉండడం వల్లనే నైజాం సర్కారు పై సాయుధ పోరాటానికి సిపిఐ పిలుపునిచ్చిందన్నారు. ఆ పోరాటంలో తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమి పంచబడిందని, వేల గ్రామాలను విముక్తి చేయడం జరిగిందని చెప్పారు. నాటి పోరాటంలో దొడ్డి కొమరయ్య మొదలుకొని నాలుగున్నర వేల మంది వీరులు అమరులయ్యారని, నేడు తెలంగాణలో గ్రామ గ్రామాన నాటి నెత్తుటి ఆనవాళ్ళు ఉన్నాయని అన్నారు. బీజేపీ కు తెలంగాణ విలీన దినోత్సవంపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ బాష్ మియా, పనాస ప్రసాద్, నాయకులు అక్కపల్లి రమేష్, కందిక చెన్నకేశవులు గన్నారపు రమేష్, గోవర్దనా చారి,దామెర క్రిష్ణ, పాల కవి, ఇల్లందుల సాంబయ్య , పార్థసారధి, ఐతా యాకూబ్, గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.