
Seasonal diseases
వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జర జాగ్రత్త!!
జహీరాబాద్ నేటి ధాత్రి:
వర్షాకాలం పూర్తిగా రానప్పటికీ దాని ప్రభావం కనబడుతోంది. అప్పుడప్పుడూ కురుస్తున్న వానలకు దోమల బెడద పెరుగుతోంది. దీనికి తోడు వాతావరణ మార్పులు, తేమ, నీటి కాలుష్యం వంటివి సాధారణ జ్వరాలకు, వైరల్ ఫీవర్లకు దారితీస్తున్నాయి. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు సైతం వ్యాపించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ సీజన్లో ఏయే వ్యాధులు వస్తాయి? లక్షణాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డెంగ్యూ జ్వరం:-
వర్షాల తర్వాత సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఏడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా ఈ వైరల్ ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే అధిక జ్వరం (104°F వరకు), తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి వేధిస్తాయి. అలాగే చర్మంపై దద్దుర్లు, అలసట, వాంతులు, కడుపు నొప్పి వంటివి కూడా కొందరిలో సంభవిస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, వైద్య నిపుణుల సలహాలు పాటించాలి.
మలేరియా:-
ప్లాస్మోడియం పరాన్నజీవి, ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా ఇది వస్తుంది. చలి, జ్వరం, వణుకు, చలి దశ తర్వాత వేడిగా అనిపించడం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, కొన్నిసార్లు వాంతులు, కామెర్లు కూడా మలేరియా లక్షణాల్లో భాగంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సింప్టమ్స్ కనిపించగానే డాక్టర్లను సంప్రదించాలి. నిర్ధారిత పరీక్షల తర్వాత చికిత్స అందిస్తారు.
వైరల్ ఫీవర్ (ఫ్లూ లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు):-
ఇన్ఫ్లుయెంజా లేదా ఇతర వైరస్ల ద్వారా కూడా వైరల్ జ్వరాలు వస్తుంటాయి. తేలికపాటి నుంచి మధ్యస్థ జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, బాడీ పెయిన్స్, అలసట ఈ జ్వరాల ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. వీటిని గుర్తించగానే వైరల్ PCR టెస్ట్ చేయించుకోవాలి. వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహాలు పాటించాలి.
టైఫాయిడ్ (ఎంటరిక్ ఫీవర్):-
సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా, కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం ద్వారా ఈ జ్వరం వస్తుంది. చిన్నగా ప్రారంభమై ఒక్కసారిగా అధిక జ్వరం రావడం, ఉదయం తక్కువగా ఉండి సాయంత్రం లేదా రాత్రిళ్లు అధికం కావడం జరుగుతుంది. బలహీనత, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు కూడా టైఫాయిడ్ లక్షణాల్లో భాగమే. కాబట్టి ఈ సింప్టమ్స్ గుర్తిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు.
చికున్‌గున్యా:-
చికున్‌గున్యా వైరస్, ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పి (దీని వల్లే ‘చికున్‌గున్యా’ అనే పేరు వచ్చింది), చర్మంపై దద్దుర్లు, అలసట వంటివి దీని ప్రధాన లక్షణాలు రక్త పరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కాబట్టి లక్షణాలు గుర్తించగానే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
లెప్టోస్పిరోసిస్:-
లెప్టోస్పిరా బ్యాక్టీరియా, కలుషిత నీటితో సంపర్కం ద్వారా నీటిలో వృద్ధి చెంది జన సమూహాలకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్లు ఎర్రబడడం, కామెర్లు వంటివి దీని ప్రధాన లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో కాలేయం, మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. రక్తం లేదా యూరిన్ టెస్ట్ (MAT లేదా PCR) ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించ సూచనలు పాటించాలి.
జాగ్రత్తలు:-
సీజనల్ వ్యాధులు సాధారణంగా దోమకాటు, కలుషిత నీరు, అపరిశుభ్రత వల్ల వస్తుంటాయి. కాబట్టి దోమల నివారణ, వాటి నుంచి సంరక్షణ ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. దోమ తెరలు ఉపయోగించడం, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చేయాలి. సాయంత్రం వేళల్లో పూర్తి చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులు ధరించండం మంచిది. దీంతోపాటు వర్షాకాలంలో నీరు భూగర్భంలోకి ఇంకడంవల్ల, డ్రైనేజీల లీకేజీ కారణంగా నల్లా నీళ్లు కూడా కలుషితం అవుతుంటాయి. కాబట్టి ఈ సీజన్లో మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలంటున్నారు నిపుణులు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించాలి.
వివరణ:-
పరిసరాల పరిశుభ్రత:
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, దోమలు, ఇతర క్రిములు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.
చేతులు కడుక్కోవడం:
చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం వల్ల సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.
లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి:
జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
నీటిని మరిగించి తాగాలి:
నీటిని మరిగించి తాగడం ద్వారా సూక్ష్మక్రిములు నశిస్తాయి.
పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినాలి:
పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినడం ద్వారా క్రిములు శరీరంలోకి చేరకుండా నివారించవచ్చు.
ఝరాసంగం మండల ప్రభుత్వ వైద్య అధికారి రమ్య