రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహణ
సమగ్ర సస్యరక్షణ చర్యలతోనే అధిక దిగుబడులు సాధ్యం
శాస్త్రవేత్త శ్రీనివాస్ నాయక్
పరకాల,నేటిధాత్రి
గురువారం మాదారం గ్రామంలో పిఎసిఎస్ చైర్మన్ అధ్యక్షతన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు పంట సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న శాస్త్రవేత్త శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక వ్యవసాయ రంగంలో రైతులు అధిక పెట్టుబడులు,పెరుగుతున్న పురుగుల ప్రభావం,తగ్గుతున్న దిగుబడులతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు.రైతులు విచ్చలవిడిగా పురుగుమందులు వినియోగించడం వల్ల పురుగుల్లో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు పంట ఉత్పత్తులపై రసాయన అవశేషాలు మిగిలి మానవ ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయని తెలిపారు.ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.లోతైన దుక్కులు దున్నడం,విత్తన శుద్ధి చేయడం,మాగిన పశువుల పేడ,వానపాముల ఎరువుల వంటి సేంద్రియ ఎరువులను వినియోగించాలని పేర్కొన్నారు.ప్రతి 100 కిలోల సేంద్రియ ఎరువుకు రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి కలిపి వాడితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
అలాగే వేపనూనె 1500 పిపిఎం మూడు ఎంఎల్‌ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని,పసుపు,నీలం,తెలుపు రంగుల జిగురు పట్టాలను ఉపయోగించాలని సూచించారు.పత్తి పంటలో బంతి,ఆముదం మొక్కలను ఎకరానికి 50 చొప్పున నాటితే లబ్ది పురుగు,కాయ తొలిచే పురుగు నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.మిరప పంటలో వైరస్ తెగుళ్ల నివారణకు జొన్న,మొక్కజొన్న,సజ్జ వంటి పంటలను రెండు వరుసలుగా సాగు చేయాలని సూచించారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వరి రకాలను సాగు చేస్తే ప్రభుత్వ బోనస్‌తో పాటు అధిక దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.అలాగే వరి,మొక్కజొన్న పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం వల్ల భూసారం పెరుగుతుందని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అరుణ్ కుమార్,ఏఈఓ శైలజ,పిఏసీఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
