కాలేశ్వరంలో ప్రారంభమైన అంత్య పుష్కరాలు
కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం
మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పవిత్ర పుష్కర స్నానాలు చేశారు
భూపాలపల్లి నేటిధాత్రి
ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో గురువారం సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజైన గురువారం ఉదయం 5:43 గంటలకు శుభ ముహూర్తాన పవిత్ర సంగమ ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి తొలి పుష్కర స్నానాన్ని ఆచరించి, ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ తదితర ప్రముఖులు పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుష్కరాలు ప్రారంభం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు త్రివేణి సంగమ తీరానికి భారీగా తరలివస్తున్నారు.
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఘాట్ల వద్ద చలువ పందిళ్లు, మిస్ట్ ఫాస్ట్ ద్వారా నీటి జల్లులు కురిసేలా చర్యలు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లతో పాటు రవాణా, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు భద్రత కొరకు 2,500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.
12 రోజుల పాటు సాగనున్న ఈ సరస్వతీ నది అంత్య పుష్కరాలకు రాబోయే రోజుల్లో భక్తులు మరింత పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం ఆసాంతం అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
