శాస్త్రీయ జ్ఞానంతోనే ప్రపంచ పురోగతి
బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్.జి.రాజేశ్వర్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
శాస్త్రీయ జ్ఞానమే ప్రజా జీవితానికి ఆయువు పట్టని,శాస్త్ర జ్ఞానం లేకపోతే ప్రపంచం ఇంతగా పురోగతిని సాధించేదికాదని బాలాజీ విద్యా సంస్థల కార్యదర్షి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు.జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా బాలాజీ టెక్నో స్కూల్లో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ దృక్పథంతో చదువుకొని నూతన ఆవిష్కరణలు చేయాలని డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత ప్రాముఖ్యత కలదని,ప్రభావశీలమైనదని,ఈ వయసులో అలవడే శాస్త్రీయ దృక్పథం భవిష్యత్తును దేదీప్యమానంగా ప్రకాశింపజేస్తుందని అన్నారు.భారత దేశానికి చెందిన సి.వి.రామన్ తాను తయారు చేసిన రామన్ ఎఫెక్ట్ కు గాను 1930 లోనే నోబెల్ బహుమతి గ్రహించిన విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలన్నారు.పాఠశాల దశలోనే సి.వి. రామన్ అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తి వాటి సమాధానాలకై అన్వేషించే తత్వమే తనను గొప్ప శాస్త్రవేత్తగా మార్చిందనే విషయాన్ని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తు చేశారు.

ఆయన పుట్టినరోజును జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు.అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా విద్యార్థులు తయారుచేసిన రెండు వందలకు పైగా వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. ఉత్తమ ఆవిష్కరణలకు డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.డి. రియాజుద్దీన్, సైన్స్ ఉపాధ్యాయులు జగదీశ్వర్, గౌతమ్, నాగరాజు, విజయ్, పూర్ణిమ, ప్రీతి, కనకరాజు, మహేందర్, రాజ్ కుమార్, సంపత్, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు