కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు
ఆశ్చర్యపరిచిన విద్యార్థుల ప్రదర్శనలు
వేములవాడ నేటిధాత్రి
వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ( సరస్వతి బ్లాక్ )లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైజ్ఞానిక ప్రదర్శనను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని, తమ సృజనాత్మకతను, శాస్త్ర విద్యపై ఆసక్తిని చాటుకున్నారు. విద్యార్థులు వివిధ శాస్త్రీయ ప్రాజెక్టులను తయారు చేసి, వాటి వెనుక ఉన్న సూత్రాలను వివరించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించేందుకు స్కూల్ యాజమాన్యం ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ, పట్టణ ప్రముఖ రైతులు పద్మలత దంపతులు, పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకట కృష్ణ హాజరై, విద్యార్థులను ప్రోత్సహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలాల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శించి ప్రయోగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ ఉపాధ్యాయ బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రదర్శన విద్యార్థుల్లో శాస్త్రపరమైన అవగాహన పెంచి, భవిష్యత్ పరిశోధనలకు ప్రేరణనిచ్చేలా సాగిందని పలువురు అభిప్రాయపడ్డారు.