సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను.

Schools

సమీప పాఠశాలలతోనే స్కూల్ కాంప్లెక్స్ లను శాస్త్రీయంగా పునర్విభజించాలి.

పెనుగొండ హై స్కూల్ ను నూతన కాంప్లెక్స్ గా ఏర్పాటు చేయాలి

గతంలో ఇష్టారాజ్యంగా, అస్తవ్యస్తంగా పాఠశాలల కూర్పు

దూరాభారంతో సవ్యంగా పర్యవేక్షణ చేయని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు

చదువులో తగ్గిన గుణాత్మకత – నష్టపోయిన విద్యార్థులు

నూతన ఇనుగుర్తి మండలంలోకి భౌగోళికంగా 15 పాఠశాలల చేర్పు

అయినా ఇంకా కేసముద్రం మండల స్కూల్ కాంప్లెక్స్ లోనే కొనసాగింపు

వచ్చే నూతన విద్యా సంవత్సరానికి ముందే స్కూల్ కాంప్లెక్స్ ల పునర్విభజన పూర్తి చేయాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

స్కూల్ కాంప్లెక్స్ లోకి సమీప పాఠశాలలను చేర్చి శాస్త్రీయంగా పునర్విభజించాలని కోరుతూ శనివారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో మండల విద్యాధికారి కాలేరు యాదగిరికి ప్రాతినిధ్యం చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ మాట్లాడుతూ గతంలో స్కూల్ కాంప్లెక్స్ ల ఏర్పాటు దగ్గర ,దూరంతో సంబంధం లేకుండా అస్తవ్యస్తంగా జరిగిందని , ఏ ప్రామాణికత లేకుండా చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. స్టేషన్ కాంప్లెక్స్ లో ఉన్న యుపిఎస్ మహమూద్ పట్నం పాఠశాల నిజానికి కేసముద్రం విలేజ్ కాంప్లెక్స్ దగ్గర్లో ఉంటుందని, అమీనాపురం సమీపంలో ఉండే మాన్సింగ్ తండా పాఠశాల స్టేషన్ , కల్వల కాంప్లెక్స్ లకు సమీపంలో ఉంటుందనీ , కానీ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే తాళ్లపూసపళ్లి కాంప్లెక్స్ లో చేర్చారని , సర్వాపురం స్టేషన్ కి దగ్గరగా ఉన్నప్పటికీ తాళ్లపూసపల్లి కాంప్లెక్స్ లో చేర్చడం, అలాగే పెనుగొండ, దాని ఆవాస పాఠశాలలన్నీ స్టేషన్ కాంప్లెక్స్ కు చాలా దూరంగా ఉన్నప్పటికీ విధి లేక దానిని స్టేషన్ కాంప్లెక్స్ లో చేర్చడం వల్ల ఆయా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు
దూరాభారంతో పాఠశాలల పర్యవేక్షణ చేయలేకపోయారని , తద్వారా పర్యవేక్షణలోపించి విద్యార్థులకు గుణాత్మక విద్య సరిగా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు

పెనుగొండ ఉన్నత పాఠశాల ఆవాసంలో ఉండే 15 పాఠశాలలన్నింటితో పెనుగొండ నూతన కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తే ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణకు సులభంగా ఉంటుందని సూచించారు.

ఇదిలా ఉంటే నూతనంగా ఏర్పాటైన ఇనుగుర్తి మండలానికి భౌగోళికంగా 15 పాఠశాలలు చేర్చినప్పటికీ ఇనుగుర్తి మండలంలో నూతన స్కూల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయకపోవడం వలన అవి ఇంకా కేసముద్రం మండల కాంప్లెక్స్ లోనే
కొనసాగుతున్నాయని, ఆయా పాఠశాలల పర్యవేక్షణ ఇనుగుర్తి మండల ఎంఈఓ మరియు కేసముద్రం మండల విలేజ్ మరియు కల్వల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేయాల్సి ఉండగా వారి మధ్య సమన్వయం కొరవడి పర్యవేక్షణ సవ్యంగా సాగలేదని ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేశారని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే ఉంటారని, వారి సర్వతోముఖాభివృద్దికి , వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు .కొంతమంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పని చేస్తే , మరికొంతమంది పర్యవేక్షణ అనే భయంతో పని చేస్తారన్నారు.
విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉన్న ఈ పర్యవేక్షణ సవ్యంగా సాగాలంటే, ఆ కాంప్లెక్స్ లో ఉండే పాఠశాలలు ఆ కాంప్లెక్స్ కు అతి సమీపంలో ఉండేలా శాస్త్రీయంగా స్కూల్ కాంప్లెక్స్లను పునర్విభజన చేయాలని ,అలాగే పెనుగొండ ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ గా మార్చాలని అధికారులను ఈ సందర్భంగా సురేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెలమాల భాస్కర్ ,అప్పాల నాగరాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!