పట్టించుకోని అధికారులు.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల,చిట్యాల మండలాల్లో సహజన వనరుల దోపిడీ ఆగేనా? అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేకుమట్ల మండలం కలికోటపల్లి శివారు మానేరు నుండి అదేవిధంగా చిట్యాల మండలం కల్వపల్లి మానేరు నుండి నిరంతరం రాత్రనక పగలనక ఇసుక దోపిడీ జరుగుతుందని గత ప్రభుత్వంలో లారీల ద్వారా అక్రమ ఇసుక రవాణా జరిగేదని ప్రస్తుత ప్రభుత్వంలో ట్రాక్టర్ల ద్వారా నిరంతరం ఇసుక అక్రమ రవాణా చేస్తూ కొంత మంది నాయకులు అట్టి ఇసుకను పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ,ప్రభుత్వాలు మారినంత మాత్రాన సహజ వనరుల దోపిడీ ఆగడం లేదని , మారింది గతంలో లారీలు ద్వారా ఇప్పుడు ట్రాక్టర్ ల ద్వారా తరలించడమేనని ఎద్దేవా చేశారు. ఈ అక్రమ రవాణా ఇదేవిధంగా కొనసాగితే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలకు తాగు సాగునీరు దొరకక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, ఇప్పటికే చలివాగు పరివాహక ప్రాంతాల్లో బోరు ఎండిపోయి పంటలు పండే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అక్రమ దందా కొనసాగుతున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ ఇసుక దందాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు ఆకునూరి జగన్, గంధం రాజశంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు..