‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు
వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఆడిందే ఆటగా..పాడిందే పాటగా కొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి ఓ ప్రభుత్వ ఉద్యోగి పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు సమాచారం. క్యాంపులో పనిచేయని వారికి సైతం దొంగ పేర్లతో చెక్కుల ద్వారా చెల్లించినట్లు తెలుస్తున్నది. బాయ్స్ పేరిట వీరంతా కలిసి కొంతమంది దొంగ పేర్లు రాసి వారి అకౌంట్లను సేకరించి అందులో డబ్బులు జమ చేశారు. ఇలా జమచేసిన డబ్బులను మళ్లీ తిరిగి వారి వద్ద నుండి కలెక్ట్ చేసుకున్నారని చెబుతున్నారు.
– బాయ్స్ పేరిట దొంగపేర్లకు డబ్బులు జమ
పేపర్ వాల్యుయేషన్ క్యాంప్‌లో పనిచేయని వారికి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఏమున్నదన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే దొడ్డిదారిన ప్రభుత్వ సొమ్మును కాజేయాలన్న ఉద్దేశ్యమేనని అర్థమౌతున్నది. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందే ఈ దొంగ పేర్లను సేకరించారు. వారికి తెలిసిన సన్నిహితులతోపాటు బంధువుల పేర్లతో దొంగలెక్కలు రాసి చెక్కుల ద్వారా వారివారి అకౌంట్లలో వేశారు. కార్యాలయ సిబ్బందినే ఈ దొంగ పేర్లను బిల్లులు తయారుచేసే ఉద్యోగికి అందించారని పక్కా సమాచారం.
– కళ్లు మూసుకుని డిఐఈవో సంతకాలు..
కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, అకౌంటెంట్‌తో చేతులు కలిపి ఈ అవినీతికి పాల్పడ్డారని, వీరు చేసిన నిర్వాకం చూస్తే అర్ధమౌతున్నది. ఇలా దొంగదారిలో తయారుచేసిన బిల్లులపై కార్యాలయ డిఐఈవో కనీసం వాటిని పరిశీలించకుండానే కళ్లు మూసుకుని సంతకాలు చేయడంతో డిఐఈవో పాత్ర కూడా ఉందన్న అనుమానం రేకెత్తుతున్నది. ఇవే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్ విషయంలో కూడా ఇంటర్‌బోర్డ్‌కు పంపిన ప్రపోజల్ అమౌంట్ వేరు, వచ్చిన మొత్తం డబ్బులు వేరు, స్క్వాడ్స్‌కు చెల్లించింది మాత్రం అంతంత మాత్రమే. ఇక మిగిలిన డబ్బును వీరు నొక్కేశారని కొంతమంది సీనియర్ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.
(అధికారి లీలలు….అవినీతి జాడలు త్వరలో…)