రోడ్ సేఫ్టీ పాటిస్తేనే ప్రమాదాల నివారణ
#నెక్కొండ, నేటి ధాత్రి:
రోడ్ సేఫ్టీ వార్షికోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు,అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ పి. రవీందర్ రెడ్డి, నెక్కొండ సీ ఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్సై మహేందర్,మోటార్ వెహికల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నరేందర్, నెక్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సమావేశానికి నెక్కొండ మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు, స్కూల్ బస్సుల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టాలని సూచించారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్, వాహన బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని, అధిక ప్రయాణికులతో వాహనాలు నడపరాదని తెలిపారు.
రోడ్ సేఫ్టీని పాటించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా, మన కుటుంబాల భద్రతకు కూడా కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవిస్తేనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని ఆయన పిలుపునిచ్చారు.
