రేపు నగరంలో జాదుగర్ ఆనంద్ ‘బ్లైండ్ ఫోల్డ్ రూట్’
ప్రఖ్యాత ఇంద్రజాల మాంత్రికుడు జాదూగర్ ఆనంద్ బ్లైండ్ ఫోల్డ్ రూట్ ఈనెల 25వ తేదీ గురువారం ఉదయం 11గంటలకు ప్రారంభమవుతుందని జాదూగర్ ఆనంద్ తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుట్టానని, ఇప్పటి వరకు 33వేల షోలు చేసి పలు అవార్డులను పొందానని తెలిపారు. 1980లో బ్రస్సేలో ఇచ్చిన ప్రదర్శనకు దిగ్రాండ్ ప్రిక్స్ అవార్డు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. అమెరికా, యూరప్, ఆసియా, అస్ట్రేలియా, ఆఫ్రికా వంటి 36దేశాలలో 33వేల ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచంలోనే ఉత్తమ జాదూగర్‌గా నిలిచానని అన్నారు. ఇంద్రజాలం రికార్డుల కోసమే కాకుండా మనిషిలో మనోవికాసాన్ని పెంపొందింపజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంద్రజాలాన్ని ఓ విద్యగా గుర్తించి దేశంలో మ్యాజిక్ ఆకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన తను వరంగల్ నగరంలో బ్లైండ్ ఫోల్డ్ ర్యాలీ నిర్వహిస్తున్నానని తెలిపారు. గురువారం ఉదయం 11గంటలకు అనికా బజాజ్ నుండి ప్రారంభమై పోచమ్‌మైదాన్, వెంకటరమణ థియేటర్ మీదుగా లేబర్‌కాలనీ, 100ఫీజ్ రోడ్, కాశిబుగ్గ, ములుగురోడ్డు మీదుగా హన్మకొండ, అదాలత్, కాజీపేట, ఎన్‌ఐటి నుండి చివరకు అనికా బజాజ్ షోరూమ్ వరకు ర్యాలీ ముగుస్తుందని తెలిపారు.