జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పాఠశాల పరిసరాలలో ఉన్నటువంటి బోర్ వెల్ లీకేజీ అవుతుందన్న విషయం తమ దృష్టికి రావడంతో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ శుక్రవారం రోజున నర్సింగాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్ వెల్ పైప్ లైన్ లీకేజ్ అవ్వడం అలాగే ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ లీకేజీ కారణంగా పాఠశాల ఆవరణలోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే మరమ్మత్తులు పూర్తి చేసి ఒక చుక్క నీరు కూడా వృధాగా పోకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు. అతి త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
*మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ప్రారంభం *
శుక్రవారం రోజున జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులను ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సంధర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్లు పనులు ప్రారంభమయ్యాయని, పైప్ లైన్ వేయడం కోసం మట్టిని తవ్వి కాల్వ తీయటం పూర్తయిందని, రేపు ఉదయం పైప్ లైన్ వేయటం మొదలవుతుందని అతి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. జైపూర్ మండల పరిధిలో ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్యలు ఉన్నట్లయితే సత్వరమే మాకు తెలియజేయాలని వెంటనే స్పందించి తగు చర్యలు తప్పక తీసుకుంటామని, వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని నీటిని వృధా చేయకూడదని ప్రజలందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఏయ్ ఆర్ డబ్ల్యూఎస్, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.