రాయలచెరువు గండి ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం
మొంథా తుఫాను కారణంగా రాయలచెరువుకు గండి పడి ఊరిని మొత్తం ముంచెత్తింది. భారీగా నీరు రావడంతో పెద్దఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొంథా తుఫాను (Cyclone Montha) ఏపీలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం తప్పింది. అయితే పంట పొలాల్లోకి నీరు చేరడంతో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారం అందజేస్తామని.. ప్రతీఒక్కరినీ ఆదుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అలాగే తుఫాను బాధితులకు ఇంటికి వెళ్లే ముందు రూ. మూడు వేల నగదు ఇవ్వడంతో పాటు బియ్యం, నిత్యావరసరాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండి పడి అక్కడి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక పశువులు చనిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మొంథా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాలో రాయల చెరువుకు గండిపడి నష్టపోయిన కుటుంబాలకు, పశువులకు ప్రత్యేక స్కేలు ఆర్థిక సాయం చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈరోజు (సోమవారం) విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి జయలక్ష్మి జీవో ఆర్టీనెంబర్ 125ను జారీ చేశారు. ఈనెల 6న వల్లూరు గ్రామం కేవీబీపురం మండలంలోని రాయలచెరువు ట్యాంకుకు గండి పడింది. దీంతో ఆ నీరంతా కాల్తూరు హరిజనవాడ, ఎస్‌ఎల్ పురం, పాతపాలెం గ్రామాల్లోకి రావడంతో భారీగా పశువులు చనిపోయాయి.
