Headlines

రవికే వరంగల్‌ సీటు.

https://epaper.netidhatri.com/

`హరికోట్ల వైపే అధిష్టానం మొగ్గు.

`పుష్కలంగా మంత్రి పొంగులేటి ఆశీస్సులు.

`విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ లో క్రియాశీలకం.

`సామాజిక సేవ రవికి ఎంతో ఇష్టం.

`సమాజ చైతన్యానికి రవి ప్రాధాన్యం.

`తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకం.

`ప్రజాసేవ కోసం ఉద్యోగం వదులుకోవడానికి సిద్ధం.

`ఉమ్మడి వరంగల్‌ ప్రజలకు సుపరిచితం.

`ఉద్యోగ సంఘాల సహకారం.

`పేదల అభ్యున్నతి కోసం రవి ఆరాటం.

`అట్టడుగు వర్గాల సంక్షేమం రవి లక్ష్యం.

`వరంగల్‌ అభివృద్ధి కోసం రవి రాజకీయం.

`గతంలోనే ఓసారి అవకాశం.

`ఈసారి కలిసి రానున్న కాలం.

హైదరబాద్‌,నేటిధాత్రి:

అవకాశాలు ఎవరికీ చెప్పి రావు. కొన్ని సార్లు వెతుక్కుంటూ వస్తాయి. అని మనకు తెలుస్తుంటాయి. ఆ అవకాశాలను ఒడిసిపట్టుకున్న వారు విజేతలుగా నిలుస్తుంటారు. అలా అని అందరికీ అవకాశాలు రావు. కేవలం కొందరికే అవి సొంతమౌతాయి. సమాజం మీద ప్రేమ, పేదల అభ్యున్నతి కోసం పాటపడాలన్న సుగుణాలున్న వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సామాజిక సేవ కోసం పరితపించేవారి కోసం కదలి వస్తాయి. అవకాశాలు కలిసొచ్చినా కొన్ని సార్లు కాలం కలిసి రాకపోవచ్చు. కాలం కలిసి వచ్చినా సరైన అవకాశాలు ఎదురుకాకపోవచ్చు. కాని ఏక కాలంలో రెండూ కలసి వచ్చే వారు కొందరే వుంటుంటారు. వారే ప్రజల్లో త్వరగా గుర్తింపు పొందుతారు. ఉన్నత స్ధానాలకు చేరుకుంటుంటారు. పేదల జీవితాలలో వెలుగులు నిండాలని, నింపాలని తపన పడే హరికోట్ల రవి లాంటి వారికి కోసం అన్నీ కలిసివస్తాయి. ఎందుకంటే పేదల జీవితాలలో వెలుగు నింపే హరికోట్ల ‘రవి’ అవుతారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్‌లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులపై సర్వత్రా ఆసక్తి నెలకొన్ని వుంది. ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన జిల్లా రిజిస్ట్రార్‌ హరికృష్ణ కోట్ల ముందజలో వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు అధిష్టానం ఆశీస్సులు మెండుగా వున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఆయనకు జిల్లాలో మంచిపేరున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంచి అనుబంధం కూడా వుంది. అందువల్ల సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే రవికే టిక్కెట్‌ దక్కుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా వరంగల్‌ నుంచి పోటీ ఎక్కువగా వుంటుంది. ఈసారి అంతకన్నా ఎక్కువగా వున్నప్పటికీ పోటీ పడాలనుకుంటున్న అభ్యర్ధులు సైతం హరికోట్ల గురించే చర్చించుకుంటున్నారు. ఆయన రాజకీయాలపై సీరియస్‌గా వున్నారంటే మాత్రం మనం ఆశలు వదిలేసుకోవాల్సిందే అని అనుకుంటున్నారట. ఎలాగైనా కాంగ్రెస్‌ నుంచి రవికే టిక్కెట్‌ దక్కే అవకాశాలున్నందున ఆయనకు సహకరించడా లేక, అంతకన్నా బలంగా ప్రయత్నం చేయడమా? అన్నది కొందరు తేల్చుకోలేకపోతున్నారట. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రవికి ఈ టికెట్‌పై హమీ వున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్‌ను ఢీ కొనాలంటే ఖచ్చితంగా బలమైన అభ్యర్ధి కావాలి.
అందరిలోనూ తలలో నాలుకలా వుండే అభ్యర్ధిని ఎంచుకోవాలి. జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచితమైన వ్యక్తి కావాలి. ప్రజల్లో మంచి గురింపున్న నాయకుడు కావాలి. ప్రతిపక్షాలు కూడా వెలెత్తిచూపించకుండా వుండేలా అభ్యర్ధి కావాలని అనుకుంటున్న కాంగ్రెస్‌కు హరికోట్ల రవి అందుకు సరైన ఎంపిక అని అనుకుంటున్నారట. దాంతో ఇప్పటికే ఆయనకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన క్షేత్ర స్దాయి పనులు చక్కదిద్దుకుంటున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక వేళ రవికే టికెట్‌ ఇస్తే తాము ఆశలు వదులుకోవాల్సిందే అని బిఆర్‌ఎస్‌, బిజేపిలు కూడా అనుకుంటున్నాయి. వరంగల్‌ పార్లమెంటు నియోకవర్గం నుంచి రవి ఎంపిక సరైందే అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. రవి ఎంపిక వల్ల కాంగ్రెస్‌కు చాలా అంశాలు గెలిచేందుకు ఉపయోగపడతాయి. ఎందుకంటే హరికోట్లరవి ఉన్నత విద్యావంతుడు. చిన్న పల్లెటూరు నుంచి కష్టపడి ఉన్నత స్ధానానికి చేరుకున్న వ్యక్తి. యువతకు ఆదర్శ ప్రాయుడు. ఉద్యోగ నిర్వహణలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అన్ని పార్టీల నేతలు కూడా ఆయనతో ఎంతో సన్నిహితంగా వుంటారు. ఎక్కడా వివాదాలు లేవు. ఉద్యోగ సంఘ నాయకుడుగా కూడా ఆయనకు మంచి పేరుంది. అంబెద్కర్‌ వాదిగా ఆయనను ఎంతో గౌరవిస్తారు. అంబెద్కర్‌ భావజాలాన్ని సమాజంలోకి ఎంతో బలంగా తీసుకుపోయిన నాయకుడు రవి. సమాజంలో చైతన్యం నింపేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల జీవితాలను ప్రభావితం చేయడంలో ఆయన ఎంతో కృషి చేస్తారు. సామాజిక సృహ కల్గిన నేతగా సమాజ చైతన్యం కోసం అనేక ప్రజా సంఘాలతో కూడా కలిసి పనిచేసిన అనుభవం రవిది. అందువల్ల అన్ని వర్గాల ప్రజలు, సంస్ధలు, ఉద్యోగ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలుకూడా రవిని ఆదరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. హరికోట్లరవి ఇటీవల రాజకీయంగా ఎంతో క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. వరంగల్‌ఎస్సీ రిజర్వు స్ధానం కావడం, జిల్లాలో అన్ని ప్రాంతాలనుంచి, అన్ని వర్గాల నుంచి మంచి సానుకూల దృక్పధం వుండడంతోపాటు, ఇంకా ఎంతో సుధీర్ఘమైన ఉద్యోగ జీవితం వున్నప్పటికీ సమాజ సేవ కోసం ఆయన పడే తపను గుర్తించి కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ ఇచ్చేందుకు సానుకూలంగా అందని సమాచారం.
మంత్రి పొంగులేటితో రవికి మంచి అనుబంధం వుంది.
గతంలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నారు. 2014 ఎన్నికల్లో మదిర నుంచి పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. పొంగులేటి 2014 ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేశారు. ఆయన ఆంతరంగికులను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు. గెలిపించుకున్నారు. అదే సమయంలో వైసిపి నుంచి రవిని పోటీ చేయమన్నారు. కాని అప్పటికి పూర్తి స్ధాయిలో నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. లేకుంటే అప్పుడే హరికోట్ల ఎమ్మెల్యేగా గెలిచి వుండేవారు. తర్వాత ఉద్యోగ నిర్వహణలో బిజీగా వున్నారు. మళ్లీ ఇంత కాలానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాలల్లో క్రియాశీలమకయ్యారు. ఆయన చెప్పినట్లే ఖమ్మంనుంచి బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చేసిన శథపం కూడా ఫలించేలా ప్రయత్నం చేశాడు. ఎంతో కష్టపడి జిల్లాను కాంగ్రెస్‌ను కంచుకోటగా చేసిన నాయకుడు మంత్రి పొంగులేటి. అలాంటి నాయకుడి ఆశీస్సులు దండిగా వున్న నాయకుడు రవి. అటు పార్టీ పెద్దల దీవెనలు, మంత్రి పొంగులేటి ఆశీస్సులతో హరికోట్లరవికి టికెట్‌ ఖాయంగానే కనిపిస్తోంది.
హరికోట్ల స్వస్ధలం ఖమ్మం జిల్లాం ముదిగొండ మండలం మల్లారం గ్రామం.
పేద దళిత కుబుంబంలో జన్మించిన రవి చిన్న తనం నుంచి ఎంతో చురుకైన విద్యార్ధి. పట్టుదలో ఎంతో కష్టపడి చదువుకున్నారు. ఉన్నత విద్యలు పూర్తిచేసుకున్న తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ జీవితంతోపాటు సామాజికబాధ్యతన నిర్వర్తించారు. అంబెద్కర్‌, పూలే స్పూర్తితో ఆయన ముందుకు సాగారు. ఉమ్మడి వరంగల్‌తో ఆయనకు ఎంతో అనుబంధం వుంది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, మరో వైపు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఒక దశలో మహబూబాద్‌ నుంచి ఆయన ట్రాన్స్‌ఫర్‌ సందర్భంలో ప్రజలు ఆయనను ఘనంగా వీడ్కోలు పలకడం ఒక గొప్ప ఉదాహరణ. ప్రస్తుతం ఆయన ఉమ్మడి వరంగల్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తూ, ఉద్యోగులు బాగోగుల బాధ్యతలు కూడా మోస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఉద్యోగులు రాష్ట్ర కన్వీనర్‌గా కూడా వున్నారు. అంతే కాకుండా గతంలో మాల ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడుగా కూడ రవి పనిచేశారు. పేద విద్యార్దులకు చదువుల కోసం నిరంతరం తన వంతు సాయం అందిస్తూ వుంటారు. తెలంగాణ ఉద్యమంలో రవి ఎంతో కీలకభూమిక పోషించారు. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో రవి అనేక మందికి సహయ సహాకారాలు అందించారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. దాంతో రవికి ప్రజల్లో మంచి పేరుంది. పేదల పెన్నిదిగా ఆయనను ప్రజలు కొలుస్తుంటారు. తన శక్తికి మంచికూడా కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు. వారి జీవితాలు నిలబెట్టారు. అటు అన్ని వర్గాలలో సత్సంబందాలు, ప్రజల్లో ప్రేమాభిమానాలు రవి సొంతం చేసుకున్నారు. అలాంటి రవికి వరంగల్‌ టికెట్‌ కేటాయిస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలపుకోసం కృషి చేస్తామని యువత చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *