ప్రపంచానికి బహుమతిగా రామాయణ
రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్…
రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం శరవేగంతో తయారవుతోంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇతిహాసాన్ని ప్రముఖ సంస్థలు ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ‘రామాయణ.. ద ఇంట్రడక్షన్’ పేరుతో ఈ సినిమా గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ ‘మేం చరిత్రను తిరిగి చెప్పడం లేదు.. మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులందరినీ ఒక చోట చేర్చి ప్రామాణికంగా ‘రామాయణ’ చిత్రాన్ని తీస్తున్నాం. ఈ సినిమా ప్రపంచానికి మేం ఇచ్చే బహుమతి అవుతుంది’ అన్నారు. ప్రామాణికంగా, భక్తిశ్రద్ధలతో ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఐమాక్స్ సహా ప్రపంచంలోని అన్ని పాపులర్ ఫార్మెట్స్‌లో విడుదల చేస్తామని దర్శకుడు నితీశ్ తివారి చెప్పారు. ఈ సినిమాలో కన్నడ హీరో యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.