
"Rajiv Gandhi Jayanti Celebrated in Bhupalapalli"
సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..
ప్రపంచదేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి వెలకట్టలేనిది..
ప్రజాస్వామ్య దేశానికి పంచాయతీ రాజ్ సంస్థలు అవసరమని గుర్తించి వాటిని తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ..
రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
భారతదేశాన్ని ఆధునిక దిశగా తీసుకెళ్లిన దూరదృష్టి కలిగిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని, ప్రపంచదేశాల్లో దేశాన్ని బలమైన దేశంగా చేయడానికి రాజీవ్ చేసిన కృషి, సేవలు మరువలేనివని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. (బుధవారం) భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి వేడుకలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… దేశానికి సమాచార, సాంకేతిక రంగానికి పునాది వేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. యువతకు శక్తి ఇచ్చిన నాయకుడిగా రాజీవ్ గాంధీ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతారన్నారు. రాజీవ్ గాంధీ టెలీకమ్యూనికేషన్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారని అన్నారు. విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను తీసుకొచ్చినట్టు గుర్తుచేశారు. యువత ప్రయోజనాలే లక్ష్యంగా ఐటీ, విద్య రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ రాజకీయాల్లో కూడా వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 61వ రాజ్యాంగ సవరణతో ఓటేసేందుకు కనీస వయసు 21 నుండి 18 ఏళ్లకు తగ్గించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్యే అన్నారు. 91 పార్లమెంట్ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను యువతకు కేటాయించి తాను మాటలకారి కాదని, చేతల్లో చూపిస్తానని రాజీవ్ గాంధీ నిరూపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు