జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందచేసిన క్రైస్తవ సంఘ సభ్యులు
మంచిర్యాల, నేటి ధాత్రి:
మత విద్వేశాలను రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవానీ, క్రైస్తవుల మనోభావాలను కించపరుస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను నిలిపివేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ,రామగుండము పోలీస్ కమీషనర్ కి మంచిర్యాల జిల్లా పాస్టర్లు అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందించారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేకమైన మత వివాదాలు, మత విమర్శలు జరుగుతున్నాయని, ఒకరి మీద మరొకరు భయంకరంగా విమర్శలు చేసుకుంటూ, మత ఉన్మాదంగా క్రైస్తవ మతాన్ని, క్రైస్తవులను విమర్శిస్తూ, క్రైస్తవుల మనో భావాలను కించపరుస్తున్నారని, యూట్యూబ్ ఛానల్స్, ఫేస్ బుక్ అనేకమైన మీడియా మాధ్యమాల ద్వారా కించపరుస్తూ దూషిస్తూ క్రైస్తవులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవ మత విశ్వాసాలను శివ శక్తి ఛానల్, ధర్మరక్షణ ఇంకా కొన్ని మాద్యమాల ద్వారా బైబిల్ ను విమర్శిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మతాల మధ్య విభేదాలను రెచ్చ గొట్టే విధంగా మాట్లాడుతూ గొడవలు చేయాలని కుట్రలు చేస్తూ భయాoదోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, ఇటువంటి వారి నుండి రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని, ఎవరి మతాన్ని, గ్రంధాలను మరొకరు విమర్శించకుండా ఒకవేల అదే విధంగా చేస్తే ఆ ఛానల్స్ ను నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పాస్టర్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ శ్యామ్యూల్, ఉపాధ్యక్షులు కే ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఏసుదాస్, మండల ఇంచార్జి రాజేష్, టీపీఎఫ్టీ ప్రెసిడెంట్ మ్యాతువ్ ఎం జార్జ్, జనరల్ సెక్రటరీ బి జోషి, కో ఆప్షన్ నెంబర్ అనీల్ కుమార్, నాయకులు ముత్తినేని రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.