ప్రొఫెసర్‌పై తప్పుడు ప్రచారాలను వ్యతిరేకించండి
శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై చేస్తున్న తప్పడు ప్రచారాలను వ్యతిరేకించాలని ప్రజాతంత్రవిద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) నాయకులు, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్క్సిస్టు-లెనినిస్టు) యుసిసిఆర్‌ఐ (ఎంఎల్) కిషన్ వర్గం ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ సుజాత దళితులపక్షాన నిలిచి, అడుగడుగున దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేఖ విధానాలను ఎండగడుతూ, పీడిత దళిత ప్రజలను చైతన్యవంతం గావిస్తున్నదని తెలిపారు. ముఖ్యంగా దళిత మహిళలకు భరోసాను ఇస్తున్నదని, తమ అధికార పార్టీలకు దాసోహం చేయటంలేదనే అక్కసుతో దేశభవిష్యత్ అయిన విశ్వవిద్యాలయం విద్యార్థులపై తమ బ్రాహ్మణీయ, మనువాద భావజాలాన్ని రుద్దడానికి వ్యతిరేఖంగా నిలబడుతూ విద్యార్థుల్లో శాస్త్రియ అవగాహన కల్పిస్తూ, మార్క్స్, పూలే, అంబేద్కర్‌ల ఆలోచనలను ప్రచారం కావిస్తూ, భూస్వామ్య అవశేషభమైన అగ్రకుల ఉన్మాదాన్ని, తమ ఉపన్యాసాలతో ఎదిరిస్తూ, ఎదిరించేలా విద్యార్థులను తయారు చేస్తున్నదని అన్నారు. ఎలాగైనా అణిచివేయాలనే దురుద్దేషంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, దాని అనుబంధ విద్యార్థి సంఘమైన ఎబివిపితో దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. అంతేగాక ఎడ్యుకేషన్ టూర్‌లకని తీసుకెళ్ళి విద్యార్థులను మావోయిస్టులతో కలిపిస్తున్నదంటూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక ఫాసిస్టు నిర్బంధపూరిత విధానాలను ఎండగడుతున్నందున తమను వ్యతిరేకించే వారెవ్వురూ ఉండకూడదని మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ దుష్ప్రచారం చేస్తూ అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. ఇటువంటి పాలకవర్గాల (కేంద్ర, రాష్ట ప్రభుత్వాల) కుటిలనీతిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్ సుజాతపై దాడులకు పూనుకుంటున్న వారు ఎవరో విద్యార్థులు, వివిధ రంగాల ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు. తప్పుడు ప్రచారాలు మాని వాస్తవాలపై ఆధారపడి మాట్లాడాలే తప్ప అవాస్తవాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ భావపరంగా దాడులు చేస్తూ మేధావులను, విద్యార్థులను అణిచివేయచూడడాన్ని అన్ని రంగాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డిఎస్‌ఓ) రాష్ట్ర నాయకులు అర్శం అశోక్, శరణ్, పథ్వి, తిరుపతీ, ఎం.అనిల్‌కుమార్, యుసిసిఆర్‌ఐ (ఎంఎల్) కిషన్ వర్గం రాష్ట్ర నాయకుడు జి.సదానందం ఉన్నారు.