కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ లో ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారని దీంతో చాలామంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే వాటిని పున ప్రారంభించాలని యుగంధర్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు గత పది రోజులుగా నెట్ వర్క్ ఆసుపత్రులన్నీ డయాలసిస్ లాంటి అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు నిలిపివేసి ఆరోగ్యశ్రీ కౌంటర్లను యజమాన్యాలు మూసివేశాయని దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యుగంధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే చికిత్స చేస్తారని ఆశతో వెళ్లిన ప్రజలకు నిరాశలు ఎదురవుతున్నాయని గత బిఆర్ఎస్ హాయంలో బిల్లులు పెండింగ్లో ఉంచడం వల్ల ఈదుస్థితి దాపురించిందని ఆరోపించారు.
పెండింగ్ బిల్లులన్నింటిని చెల్లిస్తే తప్ప తిరిగి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించలేమంటూ ఆసుపత్రి యజమాన్యాలు తేల్చి చెప్పడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లి తమకు వైద్యం అందించాలంటూ ప్రాధేయపడుతున్నారని ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరో,ఆర్తో, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి అత్యవసర సేవలు కావలసిన పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సుదూర ప్రాంతాల నుండి వైద్యం కోసం వస్తున్నారని ఆరోగ్యశ్రీ నిలిపివేసారు అనడంతో నిరాశతో వెనుదిరాగాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. కరీంనగర్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, చల్మెడ, ప్రతిమ కళాశాలలో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక అన్ని రకాల పరీక్షలు మందులు అందుబాటు లేకపోవడంతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించి పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని, ఆసుపత్రి యజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ వెంటనే చర్చలు జరిపి త్వరగా ఆరోగ్యశ్రీ అమలయేటట్లు చర్యలు తీసుకోవాలని యుగంధర్ ప్రభుత్వాన్ని కోరారు.